logo

Crime News: 36 సార్లు పొడిచి చంపాడు.. యువతిని చంపింది ప్రేమించి పెళ్లాడిన భర్తే!

కన్నవారిని కాదని ప్రేమించి పెళ్లాడిన పాపానికి యువతిని కత్తిపోట్లతో కడతేర్చాడు. నమ్మకంగా లాడ్జీకి రప్పించి భోజనంలో మత్తుమందు కలిపి రెండు కత్తులతో పొడిచి చంపేశాడు.

Updated : 09 Jun 2023 09:27 IST

నిందితుడు శ్రీనివాసకుమార్‌తో పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ, మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు

కన్నవారిని కాదని ప్రేమించి పెళ్లాడిన పాపానికి యువతిని కత్తిపోట్లతో కడతేర్చాడు. నమ్మకంగా లాడ్జీకి రప్పించి భోజనంలో మత్తుమందు కలిపి రెండు కత్తులతో పొడిచి చంపేశాడు. గత నెల 29న అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో హత్యకు గురైన సచివాలయ ఉద్యోగిని మహాలక్ష్మి కేసు కొలిక్కొచ్చింది. ఆమెను హత్యచేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీనివాసకుమారేనని పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కూర్మన్నపాలెంనకు చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (26) రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం సచివాలయంలో వ్యవసాయ సహాయకురాలుగా పనిచేస్తోంది. ఆమెను గాజువాక అరుణోదయ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాసకుమార్‌ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గిరిజన యువతి కావడంతో పెళ్లైన వారం నుంచే నిందితుడి తల్లి, కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించే వారు. వంట బాగా చేయడం లేదని, కులం తక్కువ దానివని వేధిస్తూ అవమానాలకు గురిచేసేవారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అయినా వదలకుండా శ్రీనివాసకుమార్‌ వేధించేవాడు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసి విడాకులు ఇప్పించమని వేడుకునేది. ఇది పోలీసుల పరిధిలో కాకపోవడంతో వారు జోక్యం చేసుకోలేదు.

పనిచేస్తున్న చోట ఆమెపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నతాధికారుల వద్ద ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించాడు. ఎన్నివిధాల ప్రయత్నించినా ఆమె లొంగకపోవడంతో హత్య చేయాలని పథకం రచించాడు. ఆమె తనకు విడాకులు ఇచ్చేస్తే ఉద్యోగం లేని తన జీవితం దుర్భరంగా మారుతుందనే భయం, విడాకులు ఇస్తోందనే పగా, కసి పెరిగి రెండు కత్తులను కొనుగోలు చేశాడు. గత నెల 29న నమ్మకంగా కాల్‌ చేసి ఆమెను అచ్యుతాపురంలోని లాడ్జీకి రప్పించాడు. భోజనంలో మత్తు మాత్రలు కలిపి తినిపించాడు. కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత రెండు కత్తులతో ఆమె శరీరంపై ఇష్టారాజ్యంగా దాడిచేశాడు. సైకో మాదిరిగా 16 చోట్ల లోతైన గాయాలు, మరో 20 వరకు చిన్నచిన్న గాయాలు చేసి దారుణంగా చంపేశాడు. శబ్దాలు రావడంతో లాడ్జీ సిబ్బంది యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వెళ్లే సమయానికి యువతి కొనఊపిరితో ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాసకుమార్‌ చిన్నచిన్న గాయాలు చేసుకొని పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. ఆ గదిలో లభించిన ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి తండ్రి సాంబ ఫిర్యాదు మేరకు నిందితుడిపై 302 హత్యానేరం, వరకట్నం వేధింపులు 304(బి), మహిళా హింస కింద 498, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం ప్రకారం కేసులు నమోదుచేశారు. బీటెక్‌ చదువుకున్నా ఉద్యోగం లేకపోవడం, భార్య దూరమైతే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయనే భయంతోనే మహాలక్ష్మిని హత్యచేశాడని తేలడంతో శ్రీనివాసకుమార్‌ను అరెస్టుచేశారు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సైలు సన్యాసినాయుడు, ప్రసాదరావు, ఏఎస్సై రాజాన అప్పారావు, కానిస్టేబుల్‌ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని