logo

భూ సమీకరణపై రైతుల ఆందోళన

విశాఖ జిల్లాలో నాలుగు మండలాల్లో చేపట్టనున్న భూసమీకరణపై కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు సాగుదారులు వాటిని అప్పగించేందుకు వెనకడుగు వేస్తున్నారు.

Published : 10 Jun 2023 03:26 IST

జీవనాధారం పోతుందని ఆవేదన
భూములు చేజిక్కించుకునేందుకు మధ్యవర్తుల వ్యూహాలు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో నాలుగు మండలాల్లో చేపట్టనున్న భూసమీకరణపై కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు సాగుదారులు వాటిని అప్పగించేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను నమ్ముకొని ఉపాధి పొందుతున్నామని, వాటిని కోల్పోతే జీవనం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రాథమిక సమావేశాలు నిర్వహించి విషయం తెలియజేశారు. పరిహారంగా ఇచ్చే స్థలానికి హక్కు కల్పిస్తామన్నప్పటికీ కొందరు రైతులు నమ్మలేకపోతున్నారు. అది ఎప్పుడిస్తారు? ఆ తక్కువ స్థలంలో ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.  
మూడు వారాల నుంచే: ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ గ్రామీణ మండలాల పరిధిలో 771 ఎకరాల సమీకరణకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించారు. మూడు వారాల కిందటే దాదాపు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏపీ మహాప్రాంత పట్టణాభివృద్ధి చట్టం కింద భూములు తీసుకోనున్నట్లు తెలియజేశారు. ఆ చట్టం ప్రకారమే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామంటున్నారు. చాలా వరకు ఒక్కో రైతు ఆధీనంలో రెండు  నుంచి అయిదు ఎకరాల వరకు భూములు ఉన్నాయి. వాటిని ఆనుకొని ఆక్రమణ కింద మరికొంత ఉంది. కొందరికి పది ఎకరాల వరకు ఉండగా, ఇంకొందరికి ఎకరా కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నవీ ఉన్నాయి. సేకరించే వాటిలో ఆనందపురం శొంఠ్యాం, విశాఖ గ్రామీణం పరిధి కొమ్మాదిలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి.  

ఆ తోటలే జీవనాధారం: ప్రస్తుతం గుర్తించిన భూముల్లో తోటలే అధికం. వీటిల్లో మామిడి, జీడి, సుబాబుల్‌ ఉన్నాయి. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ.. వాటి నుంచి వచ్చే ఫలసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఏళ్ల కిందట మొక్కలు వేసి వాటిని సంరక్షించుకుంటూ వస్తున్నారు. జీవనాధారంగా ఉన్న ఆ భూములను అప్పగిస్తే తమ బతుకు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆనందపురం మండలంలోని గిడిజాల, రామవరం, తంగుడుబిల్లిలో తోటలను గతంలో భూసమీకరణ కింద ఇచ్చిన రైతులు ప్రస్తుతం పనులు లేక ఖాళీగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితి చూసి దిగులు చెందుతున్నారు. ఆ తోటలను పూర్తిగా నేలమట్టం చేసి చదును చేయడంతో పచ్చదనం కనుమరుగవుతోంది. శొంఠ్యాంలో సేకరించే భూములు కొండను ఆనుకొని ఉండడంతో పశుగ్రాసం తగ్గిపోనుంది. అడవుల నుంచి జంతువులు జనావాసాల్లోకి వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.

రంగంలోకి మధ్యవర్తులు: ప్రభుత్వం భూ సమీకరణకు ఆలోచన చేసిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగారు. అక్కడి భూములను లోపాయికారిగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఆయా గ్రామాల్లో భూములన్న రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందో ఏమో అంటూ తమ దారికి తెచ్చుకునేందుకు చూస్తున్నారు. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు భూములు ఇచ్చేయాలనడంతో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ డబ్బుల కన్నా... అభివృద్ధి చేసిన ప్లాట్ల విలువ అధికంగా ఉంటుందని చెబుతూ మధ్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు