logo

నగరానికొస్తాం..!

గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 9,301 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Published : 10 Jun 2023 03:26 IST

‘సచివాలయ’ ఉద్యోగుల పైరవీలు
ప్రారంభమైన బదిలీల కసరత్తు
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 9,301 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల వీరికి ప్రభుత్వం ప్రొబేషన్‌ ఇచ్చి వేతన స్థిరీకరణ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న బదిలీలు కావడంతో ఎక్కువ మంది గ్రామీణ/గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ నగరానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకొని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వశాఖల వారీ బదిలీలు జరగనుండడంతో ఆయా శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. పనిలో పనిగా కొంత మంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికి 551 మంది దరఖాస్తు: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన బదిలీలు జరగ నున్నాయి. విశాఖ జిల్లాలో 607, అనకాపల్లి జిల్లాలో 522, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 212 చొప్పున 1341 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటికి 10,314 పోస్టులు మంజూరు కాగా, వాటిలో 1,013 ఖాళీగా ఉన్నాయి. సచివాలయాల్లో 9,301 మంది పనిచేస్తున్నారు. వీరిలో విశాఖ జిల్లాలో 5,163, అనకాపల్లి జిల్లాలో 3,328, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 810 మంది  సేవలందిస్తున్నారు. బదిలీల కోసం ఇంత వరకు 551 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.  మరో 101 మంది ఇతర జిల్లాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఈనెల 10లోపు ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంది. అయితే దరఖాస్తుల వడబోత, ఇతరత్రా పనులు పూర్తి చేయడానికి గడువు సరిపోదని పలు జిల్లాల నుంచి వెళ్లిన వినతుల మేరకు ఈనెల 15 వరకు గడువు పొడిగించారు.

కేటగిరీల వారీగా పరిశీలన: ఏయే కేటగిరీల్లో బదిలీల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాలను పరిశీలిస్తున్నారు. నాన్‌ లోకల్‌ కేటగిరీ కింద కేవలం 15శాతం లోపు మాత్రమే బదిలీలు చేయవల్సి ఉంది. ఆయా లెక్కలను యంత్రాంగం పరిశీలిస్తోంది. పోస్టులు ఖాళీలున్నప్పటికీ ప్రస్తుత బదిలీల ప్రక్రియలో వాటిని భర్తీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఖాళీల మేరకు ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు రావాలి. అలా వచ్చినా నాన్‌ లోకల్‌ కింద 15శాతం లోపే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని