logo

తెదేపా, జనసేన పొత్తుతో వైకాపా నేతల్లో వణుకు

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తిడుతూ పబ్బం గడుపుకుంటున్నారని 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ధ్వజమెత్తారు.

Updated : 18 Sep 2023 05:27 IST

మాట్లాడుతున్న మూర్తియాదవ్‌ చిత్రంలో పీవీఎస్‌ఎన్‌ రాజు, ఉషాకిరణ్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తిడుతూ పబ్బం గడుపుకుంటున్నారని 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి అమర్‌నాథ్‌ పవన్‌ కల్యాణ్‌ను నకిలీ కాపు అని వ్యాఖ్యానించారని, మరి అమర్‌నాథ్‌ తండ్రి గుడివాడ గురునాథరావు, తల్లి నాగమణి కూడా నకిలీ కాపులా అంటూ ప్రశ్నించారు. రాజకీయభిక్ష పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఇష్టానుసారంగా మాట్లాడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోందన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ ల్యాడ్స్‌ నిధులను తన వెంచర్ల వద్ద వ్యయం చేసుకుంటూ నగరాభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఎంపీ తూర్పు నియోజకవర్గంలో తనపై చంద్రబాబు పోటీ చేయాలని సవాలు విసరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. చోడవరం ఇన్‌ఛార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ తెదేపా, జనసేన పొత్తుతో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ తనను నమ్ముకున్న సీనియర్‌, జూనియర్లను తొక్కేశారన్నారు. ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

పోలీసుల కళ్లుగప్పి.. జగన్‌ దిష్టిబొమ్మ దహనం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ నేతలు ఆదివారం సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెదేపా నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల కంటపడకుండా జగన్‌ దిష్టిబొమ్మను పార్టీ కార్యాలయం వద్ద ఊరేగించారు. అనంతరం పెట్రోలు పోసి దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా తెదేపాను ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. కార్యక్రమలో దాసన సత్యనారాయణ, కోనేటి సురేషు, రామ్‌కుమార్‌, మేడపాటి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అమర్‌నాథ్‌కు బుద్ధి చెబుతాం: తెదేపా

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురించి మాట్లాడే స్థాయి మంత్రి అమర్‌నాథ్‌కు లేదని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ గుడివాడ కుటుంబాన్ని నడిరోడ్డుపై వదిలేస్తే తెదేపా అధినేత చంద్రబాబు ఆదుకుని రాజకీయంగా చేయూత అందించారన్నారు. అమర్‌కు కార్పొరేటర్‌ టికెట్‌, ఆయన తల్లికి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్‌ను చదవకుండా, ఆలోచించి మాట్లాడాలని లేకపోతే తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.

‘జగన్‌కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి..’

సింహాచలం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఆయనకు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని అప్పన్న స్వామిని కోరుకున్నట్లు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. చంద్రబాబు క్షేమంగా తిరిగి రావాలని కాంక్షిస్తూ ఆదివారం ఆమె సింహాచలం మెట్ల మార్గంలో నడుచుకుంటూ ఆలయానికొచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు జైలు నుంచి నిర్దోషిగా బయటకు రావాలని స్వామిని కోరుకున్నానని, కోట్లాది తెలుగు ప్రజల దిక్సూచి చంద్రన్న ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని