logo

అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఒక యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జీవీఎంసీ 53వ వార్డు హుస్సేన్‌నగర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ సుహానా పర్వీన్‌ (22) నగరంలో ఒక కాల్‌ సెంటర్‌లో పని చేస్తోంది.

Published : 22 Sep 2023 05:19 IST

షేక్‌ సుహానా పర్వీన్‌ (పాతచిత్రం)

మాధవధార, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జీవీఎంసీ 53వ వార్డు హుస్సేన్‌నగర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ సుహానా పర్వీన్‌ (22) నగరంలో ఒక కాల్‌ సెంటర్‌లో పని చేస్తోంది. ఈమె తండ్రి షేక్‌ రఫీ పెట్రోల్‌ బంక్‌లో, తల్లి గౌసియా గాజువాకలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. మనస్పర్థల కారణంగా గత ఆరేళ్లుగా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. హుస్సేన్‌నగర్‌లో తండ్రి వద్ద పెద్ద కుమార్తె సుహానా పర్వీన్‌, గాజువాకలో తల్లి వద్ద చిన్న కుమార్తె సుహాని పర్వీన్‌ ఉంటున్నారు. బుధవారం రాత్రి విధులకు వెళ్లిన సుహానా పర్వీన్‌ గురువారం ఉదయం ఇంటికి వచ్చింది. పెట్రోల్‌ బంక్‌లో విధులు ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వెళ్లిన రఫీ తలుపుకొట్టగా తెరవకపోవడంతో బయట కిటికీలోంచి తలుపు తీసి లోపలికి వెళ్లి చూడగా సుహానీ ఫ్యాన్‌ హుక్‌కు ఉరేసుకొని ఉంది. దీంతో వెంటనే స్థానికులు ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకుని కారణాలను పరిశీలించారు. కూతురుకి ఆత్మహత్య చేసుకునే అవసరం లేదని, ఎవరో కావాలనే ఒత్తిడి తీసుకువచ్చి ప్రేరేపించడంతోనే ఇలా చేసుకొని ఉంటుందని తల్లి గౌసియా ఆరోపిస్తోంది. మృతి చెందిన సుహానా పర్వీన్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో, అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
గతంలో ఒక యువకుడిపై కేసు నమోదు: రుషికొండకు చెందిన మధు అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ 2021 సెప్టెంబర్‌ 30న సుహానా పర్వీన్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పట్లో ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుత ఘటన నేపథ్యంలో ఆ యువకుడిని పోలీసులు విచారించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని