logo

తవ్వేస్తూ..దోచేస్తూ..!

గ్రావెల్‌ అక్రమ తవ్వకం కొందరికి కాసుల పంట పండిస్తోంది. అధికార పార్టీ నాయకుల కను   సన్నల్లో తవ్వకాలు జరుగుతుండడంతో.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు

Updated : 22 Sep 2023 06:03 IST

దువ్వాడ పరిసరాల్లో  గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు
అధికార పార్టీ ఒత్తిళ్లు.. పట్టించుకోని అధికారులు

నిల్వ చేసిన గ్రావెల్‌ గుట్టలు

న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం (దువ్వాడ): గ్రావెల్‌ అక్రమ తవ్వకం కొందరికి కాసుల పంట పండిస్తోంది. అధికార పార్టీ నాయకుల కను   సన్నల్లో తవ్వకాలు జరుగుతుండడంతో.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్య లారీల్లో గ్రావెల్‌ తరలిపోతున్నా అడ్డుకునేవారు ఉండడం లేదని స్థానికులు వాపోతున్నారు.

గాజువాక, సబ్బవరం, పరవాడ మండలాల్లో ఎక్కడ గ్రావెల్‌ కొండలు కనిపించినా.. అక్రమార్కులు అక్కడే వాలిపోతున్నారు. జేసీబీలు, క్వారీ లారీలు అందుబాటులో ఉంచుకుంటూ... రాత్రీ, పగలు తవ్వి తరలిస్తున్నారు.

  •  ప్రధానంగా గాజువాక, సబ్బవరం మండలాల పరిధి సంధ్యానగర్‌ పక్కన ఉన్న కొండలు, తోటలు, ప్రభుత్వ, ప్రైవేటు లేఅవుట్ల పరిసరాల్లో గ్రావెల్‌, మట్టి తవ్వేస్తున్నారు.
  • భూగర్భ గనులు, విజిలెన్స్‌ శాఖల అధికారులకు ముడుపులు అందడంతోనే అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు చెబుతున్నారు.
  •  దువ్వాడ సమీప గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతోనే గత నాలుగున్నరేళ్లుగా ఎక్కడికక్కడ తవ్వుకో.. దోచించి దాచుకో అన్న చందాన గ్రావెల్‌ దందా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
  •  ఇటీవల దువ్వాడ రైల్వేస్టేషన్‌ నాలుగో ప్లాట్‌ఫామ్‌ వైపు మురుగుకాలువ నిర్మాణానికి రైల్వే అధికారులు కాలువ తవ్వడంతో... అక్కడ మట్టిని కూడా అక్రమార్కులు తరలించే ప్రయత్నం చేయగా ఆర్పీఎఫ్‌  పోలీసులు అడ్డుకున్నారు.
  •  ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆర్పీఎఫ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి కేసు లేకుండా చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
  •  ఎప్పుడైనా అధికారులు గాని, సిబ్బంది గాని...అడ్డుకునే ప్రయత్నం చేస్తే మైనింగ్‌ మాఫియా సభ్యులు దాడులకు వెనకాడడం లేదు.
  •  ఇప్పటికైనా అధికారులు స్పందించి... అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని