logo

అవకతవకల మయం!

సింహాచలం దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

Published : 22 Sep 2023 05:26 IST

చేయని పనులకు బిల్లులు
అప్పన్న ఆలయ ఇంజినీరింగ్‌ విభాగంపై ఫిర్యాదులు

సింహాచలం దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. షార్ట్‌ టెండర్లు పేరిట నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. కొందరు ఉన్నతాధికారులతో కలిసి నచ్చివారికి పనులు అప్పగించి భారీగా లబ్ధి పొందారన్న విమర్శలు ఉన్నాయి. పాలకమండలి అనుమతి లేకుండా రూ.కోట్ల విలువ చేసే పనులు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ధర్మ  కర్తల మండలి ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు సైతం ఈ వ్యవహారాలను తప్పుపట్టినట్లు సమాచారం. గతంలో సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతున్న ఒకరు 2021, 2022, 2023 సంవత్సరాల్లో సాగిన పనుల్లో అవకతవకలపై దేవాదాయశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. నిధులు సక్రమంగా కేటాయించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బోర్డు ఉన్నప్పటికీ..

సింహాచలం దేవస్థానానికి ధర్మకర్తల మండలి ఉన్నప్పటికీ చాలా పనులు వీరికి తెలియపరచకుండా ‘అత్యవసరం’ పేరిట చేయించడంపై విమర్శలు రేగాయి. ప్రత్యేక ఉత్సవాల నేపథ్యంలో చేసినట్లు చెబుతున్నా... ఒకటి, రెండు పనులు కాకుండా అధిక సంఖ్యలో చేయించినపుడు తప్పనిసరిగా పాలకమండలి దృష్టికి తీసుకురావాలి. కనీసం వాటి గురించి చర్చించకుండా చేయించడంపై కొందరు సభ్యులు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన కొందరు అధికారులు కావాలనే కమీషన్ల కోసం అలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా, రెండు నెలలకు ఒకసారైనా పాలకమండలి భేటీ అవ్వాలి. అటువంటిది ఐదు నెలలుగా సమావేశమే నిర్వహించలేదు. సభ్యులకు ఇష్టం లేకున్నా..వారి దృష్టిలో పెట్టామని చెప్పుకోవడానికి కొందరు అధికారులు సంతకాలు చేయించుకున్నట్లు తెలిసింది.

అనుమతి లేకుండానే..

అప్పన్న స్వామికి చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి, గిరిప్రదక్షిణ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రతిసారి ఇంజినీరింగ్‌ విభాగం అనేక పనులకు ప్రతిపాదిస్తుంది. ఉత్సవాలు నిర్వహించే ముందు బోర్డు సమావేశంలో ఆమోదం పొందొచ్చు. అలా అన్ని ఖర్చులకు ఇంజినీరింగ్‌ విభాగం చేయడం లేదు. గిరిప్రదక్షిణ, అంతకముందు 73 రకాల పనులకు ఎటువంటి అనుమతి లేకుండా ఆ విభాగం పనులు చేపట్టింది. ఘాట్‌ రోడ్డు వద్ద పనులకు రూ.లక్షలు ఖర్చు చేశారు. అసలు అక్కడ ఏం చేశారో తెలియదు. అక్కడక్కడ చిన్నపాటి పనులు చేసి మమ అనిపించారనే ఆరోపణలొస్తున్నాయి.

  •  రాజగోపురం, లోపల మందిరాలకు పెయింటింగ్‌ వర్క్స్‌ అని చెప్పి తూతూమంత్రంగా చేస్తున్నారు. అలాగే పూల అలంకరణ, పెండాల్స్‌ వంటివి ఇష్టానుసారంగా చేపట్టి బిల్లులు చేస్తునారన్న ఆరోపణలు ఉన్నాయి.  దేవస్థానంలో పెయింట్‌ వర్క్స్‌, పైకప్పు లీకేజీల నివారణకు రసాయన పనులు, బయోటాయిలెట్లు, తాత్కాలిక క్యూలైన్లకు బిల్లులు ఇష్టానుసారంగా పెడుతున్నారంటున్నారు. విరాళాలుగా సమర్పించిన డబ్బును అధికారులు నచ్చినట్లు ఖర్చు చేయడంపై భక్తుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

విచారణకు ఆదేశించినా..

ఇంజినీరింగ్‌ పనుల్లో జరిగిన అవకతవకల మీద దేవాదాయశాఖ కమిషనర్‌ గత నెలలోనే విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ విచారణ ముందుకు సాగలేదు. ఆ మేరకు ఇంజినీరింగ్‌ అధికారులు ఉన్నతాధికారులను ప్రభావితం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలోని ఇన్‌ఛార్జి ఈవో దాని గురించి పట్టించుకోలేదు. అధిక సంఖ్యలో చేపట్టిన పనుల మీద ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బిల్లులతో కూడిన వివరాలు ఆయన ఆమోదానికి పంపగా పలుమార్లు తిరస్కరించినట్లు సమాచారం. న్యాయపరమైన అభిప్రాయం తీసుకొని రావాలని చెప్పినట్లు తెలిసింది. ఫిర్యాదుపై ఈఈ శ్రీనివాసరాజు స్పందిస్తూ...అన్ని  పనులకు నిబంధనల మేరకే టెండర్లు పిలిచి చేయించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు