logo

పట్టుదలగా నినదిస్తూ.. ప్రభుత్వ తీరును నిలదీస్తూ..

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ‘బాబుతో మేము’ అంటూ వివిధ రూపాల్లో మద్దతు ప్రకటిస్తున్నారు

Published : 22 Sep 2023 05:39 IST

జిల్లా వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు... దీక్షలు

కూర్మన్నపాలెం సమీప వడ్లపూడి తెదేపా కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ‘బాబుతో మేము’ అంటూ వివిధ రూపాల్లో మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు, దీక్షలు కొనసాగించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం ఎంవీపీకాలనీలో తూర్పునియోజకవర్గ నాయకులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరంలో ఆయన ప్రసంగించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలతో ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాలు సంపాదించారన్నారు. ఈ కేంద్రాల్లో అవినీతి జరిగిందని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రజలు ఆక్షేపిస్తున్నారని, చంద్రబాబు విడుదలయ్యే వరకు ఉద్యమం ఆగదన్నారు.

  •  తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీవీ పట్టాభిరామ్‌, కార్పొరేటర్‌ మంగవేణి, నాయకులు పాల్గొన్నారు.  బాబుతో మేము అంటూ పలువురు ముస్లిం మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి తమ మద్దతు ప్రకటించారు. పలువురు కార్యకర్తలు కరపత్రాలను పంపిణీ చేశారు.

న్యాయవాదుల పూజలు..

చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, కేసుల నుంచి క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ తెదేపా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు గురువారం పాతనగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోకాళ్లపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. 116 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కె.వి.స్వామి మాట్లాడారు. ఆధారాలు లేకుండా వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గిరిధర్‌, రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, జనసేన లీగల్‌ సెల్‌ ప్రతినిధులు కళావతి, పలక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

‘కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు’

చంద్రబాబును అరెస్టు చేసి తెదేపా నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. జీవీఎంసీ 93వ వార్డు పరిధి ప్రహ్లాదపురంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.

న్యూస్‌టుడే, వేపగుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని