logo

చంద్రబాబు అక్రమ అరెస్టు.. జగన్‌ పతనానికి నాంది

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 24 Sep 2023 04:52 IST

ఆందోళన కార్యక్రమాల్లో తెదేపా నేతలు

59వ వార్డు పిలకవానిపాలెంకూడలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే గణబాబు, పార్టీ శ్రేణులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కిల్‌ స్కాం అంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారని, పాలకుల మెప్పుకోసం కొంత మంది అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపిన జగన్‌కు పతనం ప్రారంభమైందన్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు మాట్లాడారు. అనంతరం వైకాపా ప్రభుత్వం రాష్ట్రం నుంచి పోవాలని నినాదాలు చేస్తూ తెదేపా కార్యకర్తలు గాంధీ విగ్రహం పరిసరాలను చీపుళ్లతో శుభ్రం చేశారు.

అరెస్టులతో అడ్డుకోలేరు..

కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్నతెదేపా నేతలు అనిత, పల్లా, రాజబాబు,  తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి తెదేపా కార్యాలయం వద్ద నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌కు పరిపాలన చేత కాక, ప్రశ్నించే ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారన్నారు. అందులో చంద్రబాబు అరెస్టు ఒకటన్నారు. పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, దక్షిణం, భీమిలి నియోజకవర్గాల బాధ్యులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, తెలుగు మహిళా విభాగ ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని, నిర్బంధాలు, అక్రమ కేసులతో తెదేపాను అడ్డుకోలేరన్నారు.

‘తూర్పు’లో ర్యాలీకిఆటంకాలు... ఉద్రిక్తత

ర్యాలీలో ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు

ఆరిలోవ, విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా ‘బాబు కోసం మేము సైతం’ అంటూ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శనివారం రాత్రి 10వ వార్డు పరిధి వివేకానందనగర్‌ నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీ  తోటగరువు కూడలి వద్దకు వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. ‘నిరసన తెలపటం మా ప్రాథమిక హక్కు’ అని నినాదాలు చేస్తూ నేతలు ముందుకు వెళుతుండగా అదనపు పోలీసు బలగాలను రప్పించి కదలనీయలేదు. సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలులో ఉన్నందున ర్యాలీ జరపకూడదని పోలీసులు అడ్డగించడంతో తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని గట్టిగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు జీపు ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిఘటించారు. ఈ సందర్భంలో తొపులాట జరిగింది. ఈ తోపులాటలో 13వ వార్డుకు చెందిన ఎస్‌.లక్ష్మీ అనే కార్యకర్త కిందపడిపోవడంతో దెబ్బలు తగిలాయి.

ర్యాలీ పాల్గొన్న తెదేపా శ్రేణులు

గంగవరం దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యేపల్లా శ్రీనివాసరావు, నాయకులు

రైల్వేన్యూకాలనీలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న గండి బాబ్జీ, తెదేపా నాయకులు

తోటగరువు వద్ద ర్యాలీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

అక్కయ్యపాలెంలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని