logo

ఇదేం తొండాట..!

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ కంపెనీ కాలుష్యం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, వ్యాధుల బారిన పడుతున్నామని మత్స్యకారులు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.

Published : 24 Sep 2023 04:11 IST

తొండంగి సెజ్‌లో వద్దన్నారని నక్కపల్లికి తరలింపు!
బల్క్‌డ్రగ్‌ పార్క్‌పై మత్స్యకారుల్లో ఆందోళన
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

నక్కపల్లి మండలంలో రైతుల నుంచి సేకరించిన భూములు

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ కంపెనీ కాలుష్యం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, వ్యాధుల బారిన పడుతున్నామని మత్స్యకారులు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి మండలంలో మరో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను భారీఎత్తున ఏర్పాటు చేసేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. స్థానికులకు ఉపాధి కల్పించడానికో.. ఇక్కడి వారిపై ప్రేమతోనో పెడుతున్నారా అనుకుంటే పొరపాటే. కాకినాడ జిల్లా తొండంగి సెజ్‌లో ఏర్పాటు చేయాల్సిన ఈ బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను అక్కడివారు తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతోనే ప్రాంతాన్ని మార్చాల్సి వచ్చిందని సర్కారు పైకి చెబుతోంది. వాస్తవానికి తొండంగిలో అడ్డుకుంటున్నారనే ఇక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం.

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏవీ నగరం, కోదాడ మధ్యలో 2 వేల ఎకరాలు బల్క్‌డ్రగ్‌ పార్క్‌ కోసం రెండేళ్ల క్రితమే కేటాయించారు. తొండంగి సెజ్‌ పేరుతో సేకరించిన భూముల్లో ఈ ఏడాది జూన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో ప్రధానంగా బల్క్‌డ్రగ్‌ ఏర్పాటుపైనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాలుష్యకారక పరిశ్రమలు వద్దంటూ నినాదాలు చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ), కాలుష్య నియంత్రణ మండలికి అక్కడి వాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో 2,190 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్‌ను నక్కపల్లి పారిశ్రామికవాడకు తరలించాలనే నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే అక్కడ ప్రజలు వద్దనుకున్న పరిశ్రమను ఇక్కడకు తరలించాలని నిర్ణయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా హెటెరో డ్రగ్స్‌ కాలుష్యంపై చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం ఇచ్చిన కానుకా ఇది అంటూ ప్రశ్నిస్తున్నారు. నక్కపల్లిలోని బల్క్‌డ్రగ్స్‌ పార్క్‌ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక్కడా వ్యతిరేకమే..

విశాఖ, చెన్నై పారిశ్రామిక   నడవాలో భాగంగా నక్కపల్లి నోడ్‌ ఏర్పాటు చేశారు. 4,300 ఎకరాలకు పైగా భూములను ఇదివరకే సేకరించారు. ఇందులో 2,250 ఎకరాల వరకు జిరాయితీ, మిగతావి ప్రభుత్వ, డిపట్టా, ఆక్రమిత భూములున్నాయి. వీటిలో పరిశ్రమల ఏర్పాటు కోసం మూడేళ్ల క్రితం ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. అప్పట్లోనే రసాయన, కాలుష్యకారక పరిశ్రమలు వద్దని స్థానికులు ఆందోళన చేశారు. మిగతా కంపెనీలు ఏవి పెట్టినా అభ్యంతరం లేదని, ఫార్మా పరిశ్రమలు నెలకొల్పొద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కాదు కదా అవి ఏర్పాటు చేయడానికి కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదు. హెటెరో కంపెనీ వ్యర్థ జలాలు సముద్రంలోకి విడిచిపెట్టడానికి వేసిన పైపులైన్‌తో మత్స్య సంపద తరిగిపోయి వలసలు పోయే పరిస్థితి వచ్చిందని చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులంతా 600 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎన్జీటీలో కేసు కూడా నడుస్తోంది. ఇంతలా వ్యతిరేకిస్తున్నా సర్కారు మాత్రం హెటెరో కంటే భారీ స్థాయిలో బల్క్‌డ్రగ్స్‌ పార్క్‌ను తెచ్చి వీరి నెత్తిన పెడుతుండడం విశేషం.

ప్రజాపోరాటం తప్పదు..

పరిశ్రమల కోసం రైతులు ఎంతో విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ కంపెనీలు ఏర్పాటుకు, అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. అలాగని కాలుష్య ముప్పును తెచ్చే బల్క్‌డ్రగ్స్‌ లాంటి పరిశ్రమలు పెడితే ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించం. ఇప్పటికే ఉన్న రసాయన పరిశ్రమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలో ప్రజలు వ్యతిరేకించి, ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతోనే బల్‌్్కడ్రగ్‌ పార్క్‌ని నక్కపల్లికి తీసుకొస్తున్నారు. ఇక్కడ మత్స్యకారులు కూడా ఇలాంటి పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నారు. కాదని బలవంతంగా ఏర్పాటు చేయాలని చూస్తే ప్రజా పోరాటం తప్పదు.

ఎం.అప్పలరాజు, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు

పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు, ప్రజా సంఘాల నాయకుల ఆందోళన (పాత చిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు