logo

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు నీతి ఆయోగ్‌ కితాబు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, దేశవ్యాప్తంగా 70 నగరాల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

Updated : 24 Sep 2023 04:54 IST

మాజీ మంత్రి గంటా వెల్లడి

వైకాపా ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి కేంద్రంపై ఇచ్చిన పత్రికా ప్రకటనలను చూపుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, దేశవ్యాప్తంగా 70 నగరాల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరిగాయని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గంటా మాట్లాడారు. ఇటీవల సీఓటరు సంస్థ సర్వేలో సైతం చంద్రబాబు అరెస్టు అక్రమేనని అధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. న్యాయం తమ వైపే ఉందని, ఎన్ని నిర్బంధాలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకునిపై లేనన్ని కేసులు జగన్‌పై ఉన్నాయని, పదేళ్ల నుంచి బెయిలుపై ఉన్నారని గుర్తు చేశారు. ఆర్థిక నేరాల కింద సీబీఐ జగన్‌ను పలుసార్లు విచారించిన తర్వాతే అరెస్టు చేసిందన్నారు.  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు నీతి ఆయోగ్‌ సైతం కితాబు ఇచ్చిందన్నారు. వైకాపా ప్రభుత్వం కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చిందని, ఏయూలో ఉన్న కేంద్రాన్ని అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సందర్శించి మెచ్చుకున్నారన్నారు. సంబంధిత పేపరు క్లిప్పింగులను గంటా మీడియాకు చూపించారు. తండ్రి కోసం దిల్లీ వెళ్లి న్యాయ వాదులు, వివిధ పార్టీ చెందిన నాయకులతో లోకేశ్‌ సంప్రదింపులు జరుపుతుంటే భయపడి పారిపోయినట్లు విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెదేపా నాయకులు మహమ్మద్‌ నజీర్‌, పొడుగు కుమార్‌, చిక్కాల విజయబాబు, రాజాన రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని