logo

కొత్తగా ఒక్కటీ లేదు

విశాఖను పారిశ్రామిక నగరంగా మరింత అభివృద్ధి చేస్తాం. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు తరచూ ప్రకటిస్తున్నారు.

Updated : 24 Sep 2023 05:05 IST

పారిశ్రామికవాడలకు భూకేటాయింపులో తీవ్ర జాప్యం

ఆనందపురంలో సేకరించిన భూములు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఆనందపురం: విశాఖను పారిశ్రామిక నగరంగా మరింత అభివృద్ధి చేస్తాం. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు తరచూ ప్రకటిస్తున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కొత్తగా ఒక్క పారిశ్రామికవాడ కూడా అందుబాటులోకి రాలేదు. పరిశ్రమలశాఖ మంత్రి  అమర్‌నాథ్‌ నగరంలోనే నివాసముంటున్నా వాటి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పారిశ్రామికవేత్తలకు ఆందోళన తప్పడం లేదు.

  • అన్నీ గత ప్రభుత్వాల్లోనే: నగరంలో ప్రస్తుతం పది పారిశ్రామికవాడలున్నాయి. అవన్నీ గత ప్రభుత్వాల హయాంలో ఏర్పాటైనవే. వైకాపా ప్రభుత్వంలో విశాఖ జిల్లా పరిధిలో నేటికీ ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. పరిశ్రమలకు స్థల కేటాయింపునకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపుతున్నారో లేదో కూడా అనుమానమే. నగరంలో పారిశ్రామికవాడల్లోని స్థలాలన్నీ నిండిపోయాయి. అతి స్వల్ప సంఖ్యలోనే ప్లాట్లు ఖాళీలున్నాయి. కొత్తది ఏర్పాటు చేస్తేనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముంటుంది. కొందరు ఆసక్తి చూపుతున్నా సొంతంగా స్థలం తీసుకుని, అభివృద్ధి చేసుకోవడం కష్టమని వెనుకడుగు వేస్తున్నారు.
  • దొరకని స్థలాలు: గతంలో జిల్లా పరిధిలో ఏపీఐఐసీకి కొన్ని భూములు కేటాయించారు. అవి అందుబాటులో ఉంటే అభివృద్ధి చేసి, లేఅవుట్‌ వేసి ప్లాట్లు కేటాయించే అవకాశముండేది. తర్వాత వాటినే జగనన్న కాలనీలు, ఎంఐజీ లేఅవుట్ల కోసం అప్పగించారు. దీంతో పరిశ్రమలకు స్థలాలు దొరకని పరిస్థితి. వాటిని ఇళ్ల స్థలాలకు కేటాయించిన తర్వాత ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి అమర్‌నాథ్‌ రాబోయే ఎన్నికల్లోగా ఒక్క పారిశ్రామికవాడైనా ఏర్పాటు చేయిస్తారా.. లేదా.. అని పలువురు చర్చించుకుంటున్నారు.
  • ఎన్నికల్లోగా అనుమానమే: ఆనందపురం మండలం కనుమాంలో 155 ఎకరాలను తెదేపా హయాంలో గుర్తించారు. అక్కడ పరిశ్రమలకు అనుకూలమని భావించారు. తర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటినే ఏపీఐఐసీకి కేటాయించారు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇటీవల అక్కడి రైతులకు పరిహారం అందించామని అధికారులు చెబుతున్నారు. కానీ వాటిని ఇంకా ఏపీఐఐసీకి అప్పగించలేదు. ఈ ప్రభుత్వ  హయాంలో ఆ స్థలం అందుబాటులోకి రావడం గగనమేనని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
  • అవకాశం లేక: మరోవైపు పారిశ్రామికవాడల్లో పలు ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. దాదాపు అన్నీ ‘వేకెంట్‌ బట్‌ అన్‌ఎలాటబుల్‌’ కేటగిరీలోనే ఉన్నాయి. కోర్టు కేసులు, లేఅవుట్‌ సమస్యల నేపథ్యంలో వాటిని కేటాయించేందుకు అవకాశం లేదు. కొన్ని చోట్ల ప్రత్యేక మార్గదర్శకాలు ఉండటంతో ఆ కేటగిరీకే కేటాయించాలి. మెడ్‌టెక్‌ జోన్‌లో వైద్య సంబంధిత పరిశ్రమలకే అవకాశముంటుంది.
  • మహిళా పారిశ్రామికవాడ ఏర్పాటయ్యేనా?: ఆనందపురం మండలం గిడిజాలలో ఎలీప్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో మహిళా పారిశ్రామికవాడ ఏర్పాటుచేయాలని భావించారు. ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. తర్వాత కొప్పాక, కొత్తవలస, గుర్రపాలెంలో స్థల పరిశీలన చేసినా ముందడుగు పడలేదు. తాజాగా అనకాపల్లి జిల్లా కోడూరులో స్థలాలు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ దానిపై స్పష్టత ఇవ్వడం లేదని ఎలీప్‌ ప్రతినిధులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లోగా మహిళా పారిశ్రామికవాడ పనులు జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో పారిశ్రామికవాడలు: 10

ఎంఎస్‌ఎంఈలు: 11,258

ఉద్యోగుల సంఖ్య: 1,34,800(సుమారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని