logo

తెదేపా బలగం x పోలీసుల బలం!!

దాదాపు 22 గంటల పాటు ఇదే పరిస్థితి. తమ అభిమాన నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటిలోకి వెళ్లకుండా పోలీసులను కట్టడి చేశారు.

Updated : 03 Oct 2023 06:02 IST

వెన్నెలపాలెంలో ఉత్కంఠ.. ఉద్రిక్తత!!
మాజీ మంత్రి బండారు22 గంటల పాటు నిర్బంధం
తీవ్ర ప్రతిఘటనల మధ్య అరెస్టు చేసి తీసుకువెళ్లిన పోలీసులు

బండారుతో తెదేపా ముఖ్య నేతలు

ఈనాడు, విశాఖపట్నం, పరవాడ, న్యూస్‌టుడే: వందల మంది పోలీసులు ఓవైపు. వేల మంది తెదేపా శ్రేణులు మరో వైపు. ఎవరు అడుగు కదిపినా కలకలం రేగింది.

అంబులెన్స్‌ను ఆపిన పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం

ఒకటి కాదు..రెండు కాదు... దాదాపు 22 గంటల పాటు ఇదే పరిస్థితి. తమ అభిమాన నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటిలోకి వెళ్లకుండా పోలీసులను కట్టడి చేశారు. దీంతో బలగాల సంఖ్యను పెంచి తెదేపా కార్యకర్తలు, నేతలను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.  గంట గంటకూ మారిన పరిణామాలతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉత్కంఠ...ఉద్రిక్తత నెలకొన్నాయి.

పలు నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి బండారును పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. బండారుకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, పార్టీ విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు వచ్చారు.

బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వెళ్లకుండా అడ్డుగా కూర్చున్న తెదేపా శ్రేణులు

ఆదివారం రాత్రి 10.20:

  • వెన్నెలపాలెంలో బండారు ఇంటి వద్దకు పరవాడ సీఐ ఈశ్వరరావుతో పాటు మరో పది మంది చేరుకొని తలుపులు కొట్టి కిటికీలు తెరిచారు.
  • 11.15 : ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన విషయం తెలిసి అభిమానులు రాక ప్రారంభమయింది.
  • 11.30 : డీఎస్పీ కేవీ సత్యనారాయణ వెన్నెలపాలెం వచ్చి కారులో నుంచే పరిస్థితిని గమనించి సీఐ నుంచి వివరాలు తెలుసుకున్నారు.
  • 12.55 : అర్ధరాత్రి సమయంలో ఎందుకొచ్చారని పోలీసులను తెదేపా నాయకులు ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చామని చెప్పారు..
  • 1.30 : అనకాపల్లి జిల్లాలోని మిగిలిన స్టేషన్ల నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే సమయంలో బండారు ఇంటి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు.
  • 2.00 : ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి బండారు ఇంటి వైపు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు.

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినదిస్తున్న మహిళలు

సోమవారం ఉదయం 5.00:

  • స్థానిక నాయకులు, న్యాయవాదులు ఎందుకొచ్చారంటూ డీఎస్పీని ప్రశ్నించగా.. గుంటూరులో కేసులు నమోదవ్వడంతో అరెస్టు చేసేందుకు వచ్చామని చెప్పారు.
  • 7.50 : బండారును అరెస్టు చేస్తారనే సమాచారంతో అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు ఇంటి గేటుకు అడ్డంగా బైఠాయించారు.
  • 8.00 :  కేసు విషయమై బండారును కలిసేందుకు డీఎస్పీ సత్యనారాయణ సీఐతో కలిసి ఇంటి లోపలికి వెళ్లారు.
  • 9.00 : జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, తెదేపా నేత గండి రవి బండారు ఇంటి వద్దకు వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వాగ్వాదాలతో తోపులాట జరిగింది.
  • 9.10 : పార్టీ పిలుపు మేరకు గాంధీ చిత్ర పటంతో బండారు ఇంటిలోనే దీక్షలో కూర్చున్నారు. మీడియా లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
  • అనకాపల్లిలో నిరసన..: బండారును అరెస్టు చేసి వైద్యపరీక్షల నిమిత్తం అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువస్తున్నారని తెలిసిన తెదేపా నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి తీసుకురాకుండా జాతీయ రహదారిపై తీసుకవెళ్లిపోయారు. దీంతో నేతలు నిరసన తెలిపారు.

మహిళను నిలువరిస్తున్న పోలీసులు

సోమవారం మధ్యాహ్నం 2.10:

  • బండారుకు నీరసంగా ఉండడంతో వైద్యున్ని పిలిపించగా మధుమేహం 220, రక్తపోటు కొంత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
  • 4.00 : అంబులెన్స్‌ను రప్పించగా.. అనుమతించకపోవడంతో పోలీసులకు, తెదేపా నేతలకు వాగ్వాదం జరిగింది.
  • 4.15 : బండారుకు నోటీసులు ఇచ్చేందుకు గుంటూరు నుంచి  పోలీసులు వచ్చారు.
  • 4.30 : అభిమానుల ప్రతిఘటనలను పోలీసులు తప్పించుకొని నోటీసులు ఇవ్వడానికి లోపలికి వెళ్లారు.
  • 5.00 : బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు దిల్లీ నుంచి ఇంటికి చేరుకున్నారు.

భారీగా మోహరించిన పోలీసులు

సోమవారం రాత్రి..

  • 6.00 :  నోటీసులు ఇచ్చేందుకు గుమ్మం వద్ద పోలీసులు నిరీక్షించారు.
  • 7.30 : అధిక సంఖ్యలో పోలీసులు చేరుకోగా.. కొందరు గోడలు దూకి ఇంటి ప్రాంగణంలోకి చేరుకొని తలుపులు కొట్టారు
  • 7.35 : తలుపులు తీయడంతో అయిదుగురు పోలీసులు లోపలికి వెళ్లి నోటీసులు అందజేశారు.
  • 7.55 : బండారును ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చిన పోలీసులు గుంటూరుకు తరలించారు.

బండారును గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లగా... ఇతర వాహనాల్లో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బండారు కుమారుడు అప్పలనాయుడు, తదితరులు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని