logo

కడలి ఒడిలో అగ్నిజ్వాల

చేపలరేవు కన్నీటి సంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కళ్ల ముందే జీవనాధారమైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు.

Updated : 21 Nov 2023 07:06 IST

 శోక సంద్రంగా మారిన చేపలరేవు
 ఘటనలో మొత్తం 45 బోట్లు దగ్ధం
 బాధితులు కన్నీరుమున్నీరు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: చేపలరేవు కన్నీటి సంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కళ్ల ముందే జీవనాధారమైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. గతంలో పలు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నా రెండు లేదా మూడు బోట్లు మాత్రమే కాలిపోయేవి. ఈ సారి ఏకంగా 45 బోట్లు ఆగ్నికి ఆహుతవడంతో బోట్ల యజమానులు, వాటిపై ఆధారపడ్డ మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 9 పాక్షికంగా కాలిపోయాయి. ఇక తాము ఎలా బతకాలని పరామర్శకు వచ్చిన నాయకుల వద్ద బాధితులు విలపించారు. అగ్నిప్రమాద ఘటనకు దారితీసిన కారణాలను ఇంత వరకు పోలీసులు వెల్లడించలేదు. మత్స్య ఉత్పత్తుల క్రయ, విక్రయాలతో నిత్యం సందడిగా ఉండే చేపలరేవులో సోమవారం ఎటుచూసినా విషాద వాతావరణం కనిపించింది. 45 బోట్లపై 360 మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన ఎంతో మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వీరు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది.

కారణాలపై విభిన్న వాదనలు

జీరో జెట్టీలో లంగరు వేసి ఉన్న బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని, అందులోనే తొలుత మంటలు రేగాయని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ మీడియాకు తెలిపారు. తొలుత మంటలు రేగిన బోటు (ఎంఎన్‌-12)లో ఆదివారం రాత్రి మందు పార్టీ జరిగిందని, ఆ సమయంలో భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి బోటుకు నిప్పు అంటించారనే వాదన కూడా వినిపిస్తోంది. మరో వైపు...బోటు విక్రయానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నాయని, దీనిపై ఆదివారం రాత్రి వాగ్వాదం పెరగడం మరో కారణంగా భావిస్తున్నారు. మద్యం, గంజాయి తాగిన తర్వాత కాల్చిన సిగరెట్‌ను బోటులో పడేయడంతో అది నైలాన్‌ వలలపై పడి మంటలు ఎగిశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు కాలిపోయాయి.

గంజాయి, దందాలకు అడ్డాగా

అక్కడితో ఆగింది... లేదంటే.. మరో కాళరాత్రే!!

ఈనాడు-విశాఖపట్నం: విశాఖలోని   హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో 26 ఏళ్ల క్రితం జరిగిన భయానక ఘటనను ఇప్పటికీ జనం మరచిపోలేదు. నాటి అగ్నిప్రమాదం తీవ్రతకు 60 మంది మృత్యువాత పడిన తీరు తలుచుకుంటే గగుర్పాటు రాకుండా ఉంటుందా? అదే తరహా మరో పెద్ద ప్రమాదం అంచుకు వెళ్లి విశాఖ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి చేపలరేవులో జరిగిన ఘటనతో నగరానికి పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే విశాఖకు మరో కాళరాత్రి మిగిలేది.

మానవ నిర్లక్ష్యంతో అలుముకున్న అచేపలరేవులోని జెట్టీలను రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. కొందరు గంజాయి, మద్యం తాగుతూ అక్కడే సెటిల్‌మెంట్లు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ... అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కరవైందనే చెప్పాలి. రాత్రిళ్లు పోలీస్‌ పెట్రోలింగ్‌ కంటితుడుపే. ఈ లోపాలతోనే లంగరు వేసిన బోట్లలో రాత్రిళ్లు పార్టీలు జోరుగా సాగుతున్నాయి.

గ్నికీలలకు గాలి తోడవడంతో 45 బోట్లు కళ్లముందే బూడిదవగా, అందులోని డీజిల్‌ బ్యారెల్స్‌, గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలాయి. నిప్పురవ్వలు జీరోజెట్టీ పరిధిలో ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఆ జెట్టీకి అతి సమీపంలోనే హెచ్‌పీసీఎల్‌ (విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బంకరింగ్‌ ఇన్‌స్టాలేషన్‌) ఇంధన నిల్వ కేంద్రం ఉంది. దీని పరిధిలోనే వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో ప్రతి ఒక్కరిని ఇదే అత్యంత తీవ్రంగా కలవరపరిచింది.

ఆధునికీకరణ పనులు జరుగుతుండగా: హార్బర్‌ ప్రాధాన్యం గుర్తించిన కేంద్రం సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణకు రూ.153 కోట్లు కేటాయించింది. ఏడాది కిందట ప్రధాని మోదీ ఆ పనులకు ప్రారంభోత్సవం చేశారు. కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాల వల్ల బోట్లు నిలిపే ప్రదేశం ఇరుగ్గా ఉంటుందని మత్స్యకారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇలా ఇరుకు ప్రాంతంలోనే బోట్లు నిలపడం ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా దాదాపు 13 గంటలు శ్రమిస్తేకానీ, ఈ మంటలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొందంటే అగ్నిప్రమాద తీవ్రత అర్థమవుతుంది. ఒక్కో బోటుపై 15 మంది జీవనాధారం పొందుతున్నారు. కాలిపోయిన బోట్లపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

ప్రాణభయంతో సిబ్బంది పరుగులు: పేలుళ్లతో బోట్ల నుంచి నిప్పురవ్వలు జెట్టీ సమీపంలోని వేలం కేంద్రం వద్ద చెక్కపెట్టెలపై పడటంతో అవి దగ్ధమయ్యాయి. ఆ నిప్పు రవ్వలే సమీపంలోని హెచ్‌పీసీఎల్‌ నిల్వ కేంద్రంపై పడితే ఊహకందని ప్రాణ నష్టమే జరిగేది. మంటలు ఎగసిపడటంతో ఉలిక్కిపడ్డ హెచ్‌పీసీఎల్‌లోని సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

అవశేషాలు మాత్రమే మిగిలాయి..: ఐదు నెలల కింద బోటు కొనుగోలు చేశా. దానిపై వేట సాగిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నా. మరో 8మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నా. ఇటీవలే బోటుకు మరమ్మతులు చేయించా. ఆదివారం అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదయింది. జెట్టీ జలాల్లో అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కావడం లేదు.


 మున్నం బాలాజీ, బోటు యజమాని

ఇటీవల మరమ్మతులు చేయించా..: ఏళ్ల తరబడి బోటును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ .. ఇటీవల మరమ్మతులు చేయించా.. వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అగ్నిప్రమాదంలో బోటు కాలి బూడిదయింది. అవశేషాలు సైతం జెట్టీ జలాల్లో మునిగిపోయాయి. జీవనాధారమైన బోటు ఇక లేదంటే జీర్ణించుకోలేకపోతున్నా. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

- వై.శ్రీనివాసరావు, బోటు యజమాని


వేటకు సన్నద్ధమవుతుండగా...:

సోమవారం తెల్లవారుజామున వేటకు వెళ్లేందుకు నా బోటుకు సిద్ధం చేశా. 24రోజుల పాటు సముద్రంలో ఉండేందుకు అవసరమైన ఆయిల్‌, నిత్యావసరాలు, ఐస్‌, ఇతర సామగ్రిని బోటులో నింపాం. ఇంతలో అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. బోటుతోపాటు సామగ్రి కాలిపోయాయి. రూ.30లక్షల వరకు నష్టం వాటిల్లింది.  బోటులోని 8మంది మత్స్యకారులు ప్రమాదం తెలిసిన వెంటనే బయటకు వచ్చేశారు.

- గనగళ్ల కోటయ్య


పొలాలు అమ్మి బోటు కొన్నా:

విజయనగరం జిల్లా భోగాపురం మండలం చిన కంచి మా స్వగ్రామం. పొలాలు విక్రయించగా వచ్చిన డబ్బుతో ఆరేళ్ల క్రితం బోటు కొనుగోలు చేశా. నాకు నలుగురు ఆడపిల్లలు.  అగ్నిప్రమాదంలో  బోటు బూడిదవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి.  ఎం.ఎల్లాజీ అప్పులు తీర్చేదెలా? : చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి రూపాయి పోగేశాం. దానికి కొంత అప్పు తెచ్చి బోటు కొనుగోలు చేశాం. ఇప్పుడు అగ్నిప్రమాదంలో బోటు పూర్తిగా కాలిపోయింది. మేము ఎలా బతకాలో తెలియడం లేదు. అప్పులు తీర్చకపోతే రుణదాతలు ఒప్పుకోరు. ఈ సమయంలో ప్రభుత్వమే ఆదుకోవాలి.

 అమ్మోరమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని