logo
Published : 29/11/2021 05:21 IST

ఆ నలుగురు...ఊపిరిలొదిలారు

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, కొమరాడ, బొబ్బిలి, సాలూరు గ్రామీణం, ఎస్‌.కోట, న్యూస్‌టుడే: వివిధ సంఘటనల్లో ఒకేరోజు జిల్లాలో నలుగురు ప్రాణాలొదలడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వనభోజనాలకు వెళ్లి కొందరు, రహదారి ప్రమాదాల్లో ఇంకొందరు ఆదివారం చనిపోయారు.

బొబ్బిలి పట్టణంలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్న దళాయి సంతోష్‌ (17) స్నేహితులతో కలిసి వేగావతి నదికి వన విహారానికి వెళ్లాడు. అక్కడ ఫిట్సు రావడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా...మార్గమధ్యలో మృతి చెందాడు. విద్యార్థి బట్టలు తడవడం, శరీరంపై ఇసుక ఉండటంతో నదిలో దిగి ఊపరాడక చనిపోయాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న పారిశ్రామికవాడలో ఉద్యోగిగా చేస్తున్న తండ్రి మధుసూదనరావు, తల్లి వీణ కన్నీరుమున్నీరయ్యారు.

స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వన విహారానికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన 30 మంది కొమరాడ మండలంలోని జంఝావతి జలాశయం వద్దకు ఆదివారం పిక్నిక్‌కు వెళ్లారు. డ్యాం చూస్తున్న సమయంలో ఇంటరు విద్యార్థి దుర్గాప్రసాద్‌ (17) ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించగా నీరు ఎక్కువగా తాగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్న తల్లిదండ్రులు లక్ష్మి, చిన్నా విషయం తెలుసుకొని బోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రయోగమూర్తి తెలిపారు.

ఆటో ఢీకొని మహిళ.. : సాలూరు మండలంలోని జీగిరాం జాతీయ రహదారిపై ఆటో ఢీకొన్న ప్రమాదంలో పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి (65) ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి పది గంటల సమయంలో ఆమె కుమారుడు వెంకటేశ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై సాలూరులోని బంధువుల ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టడంతో కింద పడిపోయారు. తలకు గాయమైన కళావతి అక్కడకక్కడే మృతి చెందగా, గాయాలైన వెంకటేశ్‌ను ఆసుపత్రిలో చేర్పించినట్లు గ్రామీణ ఎస్‌ఐ జగదీశ్‌నాయుడు తెలిపారు.

ధర్మవరంలో..: ఎస్‌.కోట మండలంలోని ధర్మవరం వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో అనకాపల్లి ప్రవీణ్‌ (24) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఎదురెదురుగా వచ్చిన ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పెయింటరుగా పని చేస్తున్న ప్రవీణ్‌ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని