logo
Published : 29/11/2021 05:21 IST

నెట్టుకు రావల్సిందే

నగరానికి వచ్చిన వాహనాలు

ఈనాడు-విజయనగరం: చెత్త సేకరణ, తరలింపు విజయనగరం నగర పాలక సంస్థకు భారం కానుంది. ‘క్లాప్‌’లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి వచ్చిన వాహనాల నిర్వహణ తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. సేవా రుసుము రూపంలో (యూజర్‌ ఛార్జిలు) ఇకపై ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపనున్నారు. నగర పాలక సంస్థకు గత నెల 20న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి 62 వాహనాలు వచ్చాయి. వీటిని 60 సచివాలయాలకు కేటాయించారు. మరో రెండు ఎక్కువ అవసరమున్న చోట వినియోగించుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంచారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.64,950 చొప్పున ఎస్‌డీఎస్‌ సర్వీసెస్‌ ఏజెన్సీకి చెల్లించాలి. ఈ లెక్కన నెలకు రూ.40.27 లక్షలు, ఏడాదికి రూ.4.83 కోట్లు చెల్లించాలి. పర్యవేక్షణ మాత్రం కార్పొరేషన్‌ అధికారులదే. ఇప్పుడొచ్చిన వాటితో పాటు ప్రస్తుతం 40 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి డీజిల్‌ కోసమే నెలకు రూ.10 లక్షలు వెచ్చిస్తున్నారు. చోదకులు, సిబ్బంది జీతాలు అదనం. ఇంత మొత్తం ఒక్క పారిశుద్ధ్యం కోసమే వెచ్చించడం ఎలా అని అంతా మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రజలపైనే..: చెత్తపై సేవా రుసుము చెల్లించడానికి చాలా మంది విముఖత చూపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి డబ్బులు వసూలు చేయడం కత్తి మీద సాములా మారింది. నెలకు ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60లు, ఇతర నివాసాల నుంచి రూ.90, వ్యాపారులు, చిరు వర్తకుల నుంచి నెలకు రూ.200ల చొప్పున వసూలు చేస్తారు. ఇప్పటికే 5, 23 డివిజన్లలో మూడు నెలలుగా ఇది అమలవుతోంది. నెలకు రెండు డివిజన్లు కలిపి రూ.2.54 లక్షలు లక్ష్యంగా కాగా.. మూడు నెలలకు కలిపి రూ.2.50 లక్షలు మాత్రమే వసూలు చేశారు. డిసెంబరు నుంచి నగరమంతా అమలు చేయనున్నారు. లక్ష్యం రూ.69 లక్షలు కాగా.. ఇందులో రూ.40.27 లక్షలు ఏజెన్సీకే చెల్లించాలి. ఒకవేళ అనుకున్న మేర వసూలు కాకపోతే.. ఆ ఖర్చులను నగర పాలక సంస్థే భరించాలి. దీనిపై కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మను ‘ఈనాడు’ వివరణ కోరగా.. వాహనాల నిర్వహణంతా సేవా రుసుములతో చేస్తామని, దీనిపై డివిజన్లలో అవగాహన కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.

నిర్వహణ ఇలా..: ఈ వాహనాల్లో తడి, పొడి, ప్రమాదకర, ఈ-వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తారు. ఇప్పటికే దీనికి అనుగుణంగా 1.92 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మరో 30 వేల వరకు అందించాలి. సేకరించిన చెత్తను నగరంలో నిర్మిస్తున్న నాలుగు గార్బేజ్‌ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గుణుపూర్‌లోని డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్తారు. ద్వారపూడి, దాసన్నపేట, కొత్తపేట, ధర్మపురిలో ఒక్కొక్కటి రూ.80 లక్షలతో గార్బేజ్‌ కేంద్రాలను నిర్మిస్తున్నారు. వీటికి చెత్తను తరలించడానికి 15 వాహనాల చొప్పున కేటాయించారు. దాసన్నపేటలో ఇప్పటికే ఉండగా.. మిగతా మూడుచోట్ల చేపట్టాలి. క్షేత్రస్థాయిలో చూస్తే ఇవి ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే మిగతా వాహనాల చెత్తను ఎక్కడికి తీసుకెళ్తారో చూడాల్సిందే.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని