డిజిటల్ వైపు.. అడుగులేవీ?
గ్రంథాలయం నమూనా
సాలూరు, న్యూస్టుడే: గ్రామీణులు ఇంటర్నెట్ సేవలు వినియోగించుకుని ఇంటి నుంచే విధులు నిర్వహించే విధానం తీసుకొచ్చేందుకు వైఎస్సార్ డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఉగాది నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. క్షేత్రస్థాయిలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. జిల్లాలో 195 చోట్ల భవనాల నిర్మాణానికి రూ.31.20 కోట్ల ఉపాధి నిధులు మంజూరు చేశారు. పనులను పంచాయతీరాజ్ అధికారులకు అప్పగించారు. వారు భవనాలకు అవసరమైన స్థలాలను గుర్తించి మార్కింగ్ చేశారు తప్ప ఒక్క చోటా పనులు ప్రారంభించలేదు. మార్చి నెలాఖరుతో నిధుల గడువు ముగియనున్న నేపథ్యంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
సిమెంట్ కొరత..
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కంపెనీల నుంచి నేరుగా సిమెంట్ సరఫరా చేయాలి. కొద్ది రోజులుగా నిలిచిపోవడంతో పనులు చేపట్టలేక పోతున్నామని అధికారులు తెలిపారు. సిమెంట్ వచ్చే వరకు పనులు ప్రారంభించడం కష్టంగా పేర్కొన్నారు. దీనికి తోడు బిల్లుల చెల్లింపులు జరుగుతాయో.. లేదోనని గుత్తేదారులు సైతం ముందుకు రావడం లేదు. దీనిపై విజయనగరం పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్ గుప్త మాట్లాడుతూ.. సిమెంట్ కొరత ఉందని, వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇవీ ఆదేశాలు.. : డిజిటల్ గ్రంథాలయాల మొదటి విడత పనులు జనవరి నాటికి పూర్తిచేయాలి. ఉగాది నాటికి తొలి దశలో వినియోగంలోకి తీసుకురావాలి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ఈ ప్రాంతాల్లో పనులు చేసుకోవచ్ఛు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పత్రికలు అందుబాటులో ఉంచాలి. మూడు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, స్టోరేజీకి డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలి. వీటిని విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు వినియోగించుకునేలా చూడాలి.