నగరవాసులపై ఆస్తిపన్ను బండ
ప్రత్యేక నోటీసు జారీ చేస్తున్న సిబ్బంది
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరం వాసులపై ఆస్తి పన్ను వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే చెత్త పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆస్తిపన్ను పెంపుదలను అమలు చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక నోటీసులు జారీ చేస్తోంది. పెంచిన పన్ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు. నూతన విధానం ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఇంటి పన్ను పెంపుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా.. విజయనగరం నగరపాలికలో నివాస భవనాలకు 0.15, వాణిజ్య భవనాలకు 0.3 శాతం మించకుండా కౌన్సిల్ ఆమోదం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఆన్లైన్లో పన్ను విధింపు నమోదు చేస్తున్నారు. నవంబరు 30 నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రభుత్వ నుంచి ఆదేశాలు రాగా మరో నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పన్ను పరిధిలోకి రానివి, తక్కువ మదింపు చేసిన వాటిని కూడా గుర్తించి వార్డు సచివాలయాల వారీగా ఆన్లైన్ చేస్తున్నారు.
ఏటా పెంపుదల: ప్రభుత్వ ఆదేశాలతో గతంలో వార్షిక అద్దె ప్రాతిపదికన ఉన్న ఆస్తిపన్నును ప్రస్తుతం దాని విలువ ఆధారంగా లెక్కించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆయా అసెస్మెంట్ల భూమిని చదరపు గజాల్లో.. దానిపైన ఉన్న భవన విలువను చదరపు అడుగుల్లో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ఆధారంగా లెక్కిస్తారు. భవనం నిర్మించి పదేళ్లు పూర్తయితే 11వ ఏట నుంచి ఒక్కొక్క శాతం చొప్పున తరుగుదల తీసి పన్ను విధిస్తారు. అలాగే.. ఏటా రిజిస్ట్రేషన్ విలువ పెరిగినప్పుడల్లా భారం పెరుగుతుంది.
ప్రత్యేక నోటీసులు ఇస్తున్నాం: వార్డు సచివాలయాల వారీగా నూతన విధానంలో పన్ను మదించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మొదలైందని కమిషనరు ఎస్ఎస్ వర్మ తెలిపారు. సచివాలయాల వారీగా నోటీసులు ఇచ్చి 15 రోజుల వ్యవధిలో అభ్యంతరాలు తెలియజేసేందుకు రివిజన్ పిటీషన్ వేసేందుకు గడువు ఇస్తామని చెప్పారు.
నోటీసులు జారీ చేయాల్సిన అసెస్మెంట్లు - 62,792
మూలధన విలువలోకి మార్పు చేసినవి - 13,815
ప్రత్యేక నోటీసులు తయారైనవి - 2,204
ప్రస్తుత ఏడాది డిమాండ్ - రూ.18.10 కోట్లు
పెరుగుదల వల్ల వచ్చే ఆదాయం - రూ.2 కోట్లు పైబడి