logo
Published : 01 Dec 2021 06:09 IST

కట్టుకున్నారు.. కట్టండి

ఓటీఎస్‌ రుణాలు చెల్లించాలని ఒత్తిడి


డబ్బులు చెల్లించాలని ఇంటింటికీ వెళ్లి అడుగుతున్న అధికారులు

ఓటీఎస్‌.. అధికారులకు తలనొప్పిగా మారగా.. లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం అధికారులకు లక్ష్యాలు నిర్దేశించడంతో తెల్లారింది మొదలు జాబితాలు పట్టుకొని ఇంటింటికీ తిరిగి డబ్బులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల తాము అసలు రుణమే తీసుకోలేదని.. డబ్బులు చెల్లించమని ఎలా అడుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు-విజయనగరం, విజయనగరం పట్టణం, సాలూరు, బొబ్బిలి, బెలగాం, నెల్లిమర్ల: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 వరకు ఇల్లు నిర్మించుకున్న వారికి ఓటీఎస్‌ వర్తింపజేస్తున్నారు. ప్రస్తుతానికి సొంత స్థలంలో గృహం కట్టుకున్న యజమాని లేదా వారి వారసులకు హక్కులు కల్పిస్తున్నారు. ఇలాంటి వారు జిల్లాలో 76,514 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.20 వేలు కడితే పాత రుణాల మాఫీతో పాటు సచివాలయాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

అప్పుడు పంచాయతీలు

కొన్నిచోట్ల పంచాయతీలు ఇప్పుడు పురపాలక సంఘాల్లో విలీనమయ్యాయి. ఆ సమయంలో తీసుకున్న రుణానికి ఇప్పుడు ఎక్కువ చెల్లించమనడంతో లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ రెండేళ్ల కిందట ఏర్పడింది. ఇందులో అప్పట్లో పంచాయతీలుగా ఉన్న అయ్యన్నపేట, కణపాక, ధర్మపురి, జమ్ము, గాజులరేగ కేఎల్‌పురం ప్రాంతాలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల వారు సుమారు 1168 మంది ఇప్పుడు రూ.10 వేలకు బదులు రూ.20 వేలు కట్టాల్సి ఉంది. ఇక నెల్లిమర్లను 2013లో నగర పంచాయతీగా మార్చారు. ఇందులో జరజాపుపేట పంచాయతీని విలీనం చేశారు. ఇక్కడి వారు రూ.10 వేలకు బదులు రూ.15 వేలు కట్టాలని చెబుతున్నారు.

చిరునామా ఎక్కడ?

జిల్లాలో 2,89,818 మంది లబ్ధిదారులున్నట్లు ప్రభుత్వం జాబితా పంపించింది. దీని ఆధారంగా వారి వివరాలు సేకరణ చేపట్టగా చాలాచోట్ల చిరునామాలు దొరకడం లేదు.

H ముఖ్యంగా ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టకుండానే కొందరు బిల్లులు పొందారు. మరికొందరి పేరుపై రెండు, మూడు ఇళ్లు ఉన్నాయి. వారి నుంచి ఎలా కట్టించుకోవడమో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల అసలు లబ్ధిదారు నుంచి ఇద్దరి, ముగ్గురి చేతులు మారాయి.

H 2006 నుంచి 2009 మధ్య ఇందిరమ్మ 1,2,3 విడతల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. వీరికి పొదుపు సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేశారు. ఒకే ఇంటిపై ముగ్గురు, నలుగురు రుణాలు పొందారు. ఇప్పుడు వీరి వివరాలు కూడా తెలియడం లేదు. ఒక్క విజయనగరంలోనే సుమారు ఏడు వేల మంది చిరునామాలు దొరకడం లేదు.

మేం తీసుకోలేదు

మా తాతల కాలం నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. గృహ నిర్మాణ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోలేదు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వచ్చి డబ్బులు కట్టమంటున్నారు. మేము రుణమే తీసుకోలేదని అంటే జాబితాలో పేరుందని చెబుతున్నారు. - అక్యాన సంతోషి, సాలూరు

సరి చేసి గుర్తిస్తాం..

మ్యాపింగ్‌లో జరిగిన చిన్నచిన్న పొరపాట్ల కారణంగా కొందరి వివరాలు పక్క గ్రామాల్లో నమోదయ్యాయి. అలాంటి వారి చిరునామాలు దొరకడం లేదు. తప్పులను సరిచేసి మరోసారి పరిశీలిస్తాం. ఇల్లు మంజూరై రుణం తీసుకున్న వారికే ఓటీఎస్‌పై అవగాహన కల్పిస్తున్నాం. మిగతా వారికి సంబంధం లేదు. ఎం.బుక్‌లో వివరాల ప్రకారమే అడుగుతున్నాం. మంజూరు లేకుండా అడిగేది ఉండదు.

- కూర్మినాయుడు, పథకం సంచాలకుడు, గృహ నిర్మాణ శాఖ

చిరునామాలే లేవు

n సాలూరులో 3242 మంది రుణాలు పొందగా ఇందులో 433 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు. జియోట్యాగింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన వారు 1235 మంది ఉంటారు. వీరి నుంచి రూ.1.85 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 60 మంది నుంచి రూ.9 లక్షలు రాబట్టారు.

n నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 1005 మందికి గత నెల 27 వరకు 14 మంది నుంచి రూ.2.04 లక్షలు వసూలు చేశారు.

n విజయనగరంలో 14,677 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 7,739 మంది చిరునామా లభ్యం కావడం లేదు. 3367 మంది వివరాలు ఆన్‌లైన్‌ చేశారు. ఇందులో ఓటీఎస్‌కు అర్హులైన వారు 1854 మంది ఉండగా.. 240 మంది నుంచి రూ.49.39 లక్షలు వసూలైంది.

n బొబ్బిలి పట్టణంలో 2,385 మంది పేర్లతో జాబితా రాగా 512 మంది నుంచి సుమారు రూ.76.80 లక్షలు వచ్చింది.

n పార్వతీపురంలో 1566 మందికి 1106 మందిని గుర్తించారు. ఇందులో 997 మంది ఓటీఎస్‌కు అర్హులని తేల్చారు. 290 మంది నుంచి రూ.43.50 లక్షలు వసూలు చేశారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని