logo

ప్రోత్సాహకం లేక..ఊరుకున్న ప్రగతి

పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరి సుమారు తొమ్మిది నెలలు గడిచాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏకగ్రీవ సర్పంచులు.

Published : 05 Dec 2021 05:17 IST

ఈనాడు-విజయనగరం: పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరి సుమారు తొమ్మిది నెలలు గడిచాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏకగ్రీవ సర్పంచులు.

జిల్లాలో 959 పంచాయతీలుండగా.. 801 చోట్ల ఫిబ్రవరి 13,17,21 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. 155 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన నగదు ప్రోత్సాహకం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిధులతో పల్లెలను అభివృద్ధి చేసుకుందామన్న ఉద్దేశంతో కొన్ని గ్రామాల్లో పోటీ లేకుండా సర్పంచిని ఎన్నుకున్నారు. చాలామంది ప్రణాళికలు కూడా వేసుకున్నారు. కానీ.. ఇప్పటివరకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.

ఇవి రావు.. అవి వెనక్కి

ఇప్పటికే పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు రాని పరిస్థితులున్నాయి. ఇంతలో ఆరు నెలల కిందట ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా వందలాది పంచాయతీల నుంచి విద్యుత్తు బకాయిల పేరిట సుమారు రూ.37 కోట్లు వెనక్కి తీసుకుంది. చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువే తీసుకోగా.. తిరిగి వెనక్కి ఇచ్చేస్తారని అధికారులు తెలిపారు. అవి ఇప్పటికీ రాకపోగా.. రెండు విడతల్లో వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.131 కోట్లలో కొంత వెనక్కి తీసుకున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఏకగ్రీవ నజరానాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని పలువురు సర్పంచులు అంటున్నారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారిణి సుభాషిణి ‘ఈనాడు’తో మాట్లాడుతూ నిధుల మంజూరు అంశం రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు.

నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఆర్థిక సంఘం నిధులతో పాటు ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు వస్తే పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ, శ్మశానవాటిక అభివృద్ధి, పైడితల్లి అమ్మవారి ఆలయానికి రహదారి నిర్మించాలని అనుకున్నాం. ప్రోత్సాహకం ఏమో కానీ.. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.7 లక్షల వరకు వెనక్కి తీసుకున్నారు.

- ఉయ్యాల సత్యనారాయణ, ఆకులకట్ట సర్పంచి, బాడంగి మండలం

అభివృద్ధి కుంటుపడుతోంది:

గతంలో ప్రోత్సాహక నిధులు వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు అవి ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా వెనక్కి తీసుకుంటున్నారు. మా పంచాయతీలో సిమెంటు రహదారులు, కాలువలు నిర్మించాలని అనుకున్నాను. డబ్బులు లేక చేసే అవకాశం లేకుండా పోతోంది.

-గోకాడ ముసలినాయుడు, కళ్లేపల్లి ఏకగ్రీవ సర్పంచి, లక్కవరపుకోట మండలం

నజరానా ఇలా..

జనాభా ప్రోత్సాహకం (రూ.లక్షల్లో)

2 వేల లోపు  5

2 నుంచి 5 వేలు  10

5-10 వేలు  15

10 వేలకు పైగా  20

ఏకగ్రీవ పంచాయతీలు: 155

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని