logo

మొక్క.. బతకాలి ఎంచక్కా

గ్రామాల్లో మొక్కల్ని పెంచే బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పర్యవేక్షణలో రెండేళ్లుగా జగనన్న పచ్చతోరణం పథకం కింద మొక్కల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో

Published : 05 Dec 2021 05:17 IST

రెండేళ్ల పాటు పంచాయతీలకు సంరక్షణ బాధ్యతలు


పచ్చతోరణం పథకంలో నాటిన మొక్కలు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లో మొక్కల్ని పెంచే బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పర్యవేక్షణలో రెండేళ్లుగా జగనన్న పచ్చతోరణం పథకం కింద మొక్కల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో బతికేలా సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలని, అది 85-90 శాతానికి మించి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో కి.మీ.కు 400 చొప్పున 1117.1 కి.మీ. మేర మొక్కలు నాటారు. వాటి కోసం 1,04,920 ట్రీగార్డులు కేటాయించారు. ఇవి చాలని చోట ప్రత్యామ్నాయంగా వెదురు, గట్టి కర్రలు లేదా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు వేతనదారుల్ని ఎంపిక చేశారు. ప్రతి రెండు వందల మొక్కలకు గ్రామపంచాయతీ ఆమోదంతో ఒక వేతనదారుడ్ని ఎంపిక చేశారు. నెలకు రూ.4 వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. వేతనదారులకు వేతనం అందాలంటే వాటిని బతికించాలనే నిబంధనను కూడా ప్రభుత్వం విధించింది. మొక్కలకు నీటి తడుపుల కింద నెలకు ఒకసారి రూ.1700 చెల్లిస్తారు. మొదటి సంవత్సరం ఎనిమిదినెలలు, రెండో ఏడాది 12 నెలలు చెల్లిస్తారు. ఏడాదికి 30 సార్లు తడులు పెట్టాలి. ఈ మొత్తాన్ని మెటీరియల్‌ కాంపోనెంట్‌ రూపంలో చెల్లిస్తారు.

పర్యవేక్షిస్తున్నాం: ఈ ఏడాది ఆరడుగులు దాటిన మొక్కలే నాటాం. పశువులు తినేందుకు వీలు లేకపోవడంతో తొందరగా ఇవి ఎదిగి, ఎక్కువ బతికే అవకాశముంది. గతేడాది 68-70 శాతం మాత్రమే బతికాయి. పంచాయతీల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, క్షేత్రసహాయకులు, మండల స్థాయిలో ఏపీవో, ఎంపీడీవో, జిల్లాలో జడ్పీ సీఈవో, పంచాయతీ అధికారిణి పర్యవేక్షిస్తారు. ప్రతి మొక్కను బతికించేలా అన్ని స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నాం. - ఉమాపరమేశ్వరి, పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ

చేపట్టిన పనులు - 1343

కిలోమీటర్లు- 1117.1

నాటిన మొక్కలు- 4,46,838

వ్యయం - 409.29 (రూ.లక్షల్లో)

ప్రస్తుతం బతికున్నవి: 98.13శాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని