logo

గండం గట్టెక్కినట్టే

‘జవాద్‌’ బలహీనపడటంతో గండం తప్పినట్లేనని యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రికి తీరం అల్లకల్లోలంగా మారింది. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో

Published : 05 Dec 2021 05:17 IST


శనివారం రాత్రి ముక్కాం తీరంలో సముద్రం మరింత

ముందుకు రావడంతో పడవల్ని ఒడ్డుకు చేరుస్తున్న మత్స్యకారులు

ఈనాడు-విజయనగరం, కలెక్టరేట్‌, భోగాపురం, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: ‘జవాద్‌’ బలహీనపడటంతో గండం తప్పినట్లేనని యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రికి తీరం అల్లకల్లోలంగా మారింది. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో సముద్రం 120 అడుగులు ముందుకొచ్చింది. తుపాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటవచ్చని, అప్పటి వరకు ప్రస్తుత పరిస్థితులనే కొనసాగించాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. పోలి పాఢ్యమి సందర్భంగా నదీ, సముద్రాల్లో స్నానాలకు మహిళలను అనుమతించవద్దన్నారు. పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని ప్రకటించారు.

ప్రత్యేక పర్యవేక్షణ

తుపాను శనివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. 154 పునరావాస కేంద్రాల్లో 3260 మంది మత్స్యకారులకు ఆశ్రయం కల్పించగా.. నదులు, చెరువుల సమీపంలో పాకల్లో ఉన్న 1300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 50 మంది గర్భిణులను ఆసుపత్రుల్లో చేర్పించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో రాత్రి రెండు గంటల వరకు జేసీలు ఆర్‌.మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, తర్వాత నుంచి కలెక్టర్‌ సూర్యకుమారి, జేసీ కిషోర్‌కుమార్‌ ఉండి పరిస్థితులను పర్యవేక్షించారు. జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెల్లవారుజాము రెండు గంటల వరకు భోగాపురంలోనే ఉండి పరిస్థితులపై సమీక్షించారు.

19 మండలాల్లో పునరావాస శిబిరాలు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని 19 మండలాల్లో పునరావాస శిబిరాలకు ఏర్పాట్లు చేశామని జడ్పీ కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగా ఏడు మండలాల్లోని 13 పంచాయతీల్లో 361 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించామన్నారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం, దాసుపేట, పెదకాద, ఆర్‌.ఆర్‌.పురం, బొండపల్లిలో గొల్లుపాలెం, పాత పనసలపాడు, తెర్లాంలో సుందరాడ, భోగాపురంలో భోగాపురం, డెంకాడలో చొల్లంగిపేట, పూసపాటిరేగలో తిప్పలవలస, ఎస్‌.కోటలో రెల్లివీధి, పోతనాపల్లి, గంట్యాడలో గంట్యాడ పంచాయతీల్లోని వారిని తరలించినట్లు చెప్పారు.


చింతపల్లిలో పోలీసులకు సూచనలు చేస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్‌

ఉదయం నుంచి పస్తులు

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలోని నిర్వాసితులకు శనివారం సాయంత్రం 4 గంటల వరకు భోజన ఏర్పాట్లు చేయలేదు. పస్తులతో ఉన్నామని, ఒక్క అధికారి కూడా ఇటు రాలేదని నిర్వాసితులు ‘ఈనాడు-ఈటీవీ’ ముందు వాపోయారు. శుక్రవారం రాత్రి ఏదో అన్నం పెట్టి, విద్యుత్తు సౌకర్యం లేని భవనంలో వదిలి వెళ్లారన్నారు. తహసీల్దారు రమణమ్మ స్పందించి అప్పటికప్పుడు వంట చేయించి ఆరు గంటలకు భోజనాలు ఏర్పాటు చేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ ఉండలేమంటూ బాలింతలు పిల్లల్ని తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం రాత్రి చీకట్లోనే బస చేశారు.

ఆందోళనొద్ధు. అప్రమత్తంగా ఉన్నాం: బొత్స

మాట్లాడుతున్న మంత్రి సత్యనారాయణ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జవాద్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుపాను ఒడిశాలో పూరీ వద్ద తీరం దాటనుందని, అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు శనివారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం డివిజన్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని వివరించారు. రైతులు నష్టపోకుండా 1,500 టార్పాలిన్లను అందజేశారని వివరించారు. ధాన్యం రంగు మారినా, ముక్కినా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి కాంతిలాల్‌దండే, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సంయుక్త కలెక్టర్లు కిశోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, వెంకటరావు, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డీవో భవానీశంకర్‌ పాల్గొన్నారు.


భోగాపురం ఉన్నత పాఠశాలలో నిర్వాసితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని