logo

స్వచ్ఛత కనుమరుగు

బహిరంగ మల, మూత్ర విసర్జన సాంఘిక నేరం. దీన్ని అరిట్టేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ను ఆరేళ్లు కిందట అమలు చేసింది. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, పట్టణాల్లో మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించింది.

Published : 17 Jan 2022 05:58 IST

నిర్వహణకు నోచుకోని మరుగుదొడ్లు
అపరిశుభ్రతకు నిలయాలుగా పరిసరాలు

సాలూరు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి పక్కనున్న ఈ సామాజిక మరుగుదొడ్లు వినియోగానికి దూరమయ్యాయి. బోర్లు పనిచేయక, నీటి సరఫరా లేక వాడటం లేదు. పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది నదీ ప్రాంతంలో బహిరంగ మలవిసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది.

సాలూరు, విజయనగరం పట్టణం, బొబ్బిలి, బెలగాం, న్యూస్‌టుడే: బహిరంగ మల, మూత్ర విసర్జన సాంఘిక నేరం. దీన్ని అరిట్టేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ను ఆరేళ్లు కిందట అమలు చేసింది. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, పట్టణాల్లో మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించింది. రూ.కోట్లు ఖర్చు చేశారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఇదంతా గతం. ప్రస్తుతం సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, వినియోగం అధ్వానంగా మారింది. పురపాలికలు, నగర పాలక సంస్థలో పదుల సంఖ్యలో మరుగుదొడ్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. ఏళ్లు గడుస్తున్నాయి తప్ప వాటి బాగుకు చర్యలు శూన్యం. మురికివాడల్లో నివసించే ప్రజలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు.పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
నేతలు వస్తే మూతలే: మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనుకుంటే గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారని ప్రభుత్వ అధికారులు పనులు చేయించలేక మిన్నకుండిపోతున్నారు. పట్టణాలకు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చిన ప్రతిసారీ వాటిని రంగుల పరదాలతో మూసేస్తున్నారు. 2019 అక్టోబరులో సాలూరుకు గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వచ్చినప్పుడు మక్కువ బైపాస్‌ రోడ్డు పక్కన, 2020 డిసెంబరులో మంత్రి బొత్స ప్రభుత్వాసుపత్రి పనుల శంకుస్థాపనకు వచ్చినపుడు వారి కంటపడకుండా పాడైన మరుగుదొడ్లను గుడ్డలతో కప్పి మూసేశారు.


విజయనగరం సుద్ధవీధిలో ఇలా..

నిర్వహణకు వెనకడుగు 
 సామాజిక మరుగుదొడ్ల నిర్వహణకు కొన్ని మహిళా సంఘాలు, పారిశుద్ధ్య కార్మిక సంఘాల నాయకులు వెనకడుగు వేస్తున్నారు.సకాలంలో బిల్లులు చెల్లించక పోవడమే కారణం. విద్యుత్తు మోటార్లు కాలిపోయి, బోర్లు పనిచేయక, చేసిన వాటికి బిల్లులు చెల్లించక పోవడంతో రెండేళ్లుగా మూలకు చేరాయి. అత్యవసర పనుల్లో భాగంగా వీటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉన్నా...అలా చేయడం లేదు. 

అధికారులు ఏమన్నారంటే: మరమ్మతులకు గురైన మరుగుదొడ్లను గుర్తించాం. పనులు చేయించి వినియోగంలోకి తెస్తాం. వాటిని నిర్వహించేవారికి బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాం. బహిరంగ మలవిసర్జన జరగకుండా చూస్తామని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు కమిషనర్లు ఎస్‌ఎస్‌ వర్మ, పి.సింహాచలం, ఎస్‌. శ్రీనివాసరావు, హెచ్‌. శంకరరావు తెలిపారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని