logo

అండగా..100

గతేడాది జిల్లాలో డయల్‌-100కు 25,241 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఇందులో తప్పుడు సమాచారం, ఆకతాయిలు, సరదాగా చెక్‌ చేయడం వంటివి 14,702 కాల్స్‌ నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

Published : 18 Jan 2022 05:35 IST


కలెక్టరేటు దగ్గరున్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: గతేడాది జిల్లాలో డయల్‌-100కు 25,241 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఇందులో తప్పుడు సమాచారం, ఆకతాయిలు, సరదాగా చెక్‌ చేయడం వంటివి 14,702 కాల్స్‌ నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన వాటిలో కొట్లాటలకు సంబంధించి 851, మహిళలపై దాడులు, వేధింపులకు 327, దొంగతనాలు 237, ఆత్మహత్యలు 56, న్యూసెన్స్‌వి 2,288 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపారు. వీటిని ఆయా స్టేషన్లకు సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తారు. చర్యలు ఏం తీసుకున్నారో..? తరువాత ఆరా తీసి నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తారు. గతేడాది నేరుగా డయల్‌-100కు వచ్చిన ఫోన్స్‌ కాల్స్‌ ఫిర్యాదులపై 242 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. డీజీ కార్యాలయానికి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అనుసంధానమై ఉంటుంది. వచ్చే ప్రతి ఫోన్‌ జిల్లాలో పాటు, రాష్ట్ర విభాగంలో నమోదవుతుంది. అందులో వాయిస్‌ రికార్డులు సైతం నిక్షిప్తమవుతాయి. ఒక్కోసారి సరిహద్దు జిల్లాల వారివి అనుసంధానమవుతుంటాయి. ఆ వివరాలు తెలుసుకొని, సంబంధిత జిల్లాలోని ఆయా స్టేషన్ల వారికి సమాచారం చేరవేస్తామని పోలీసులు చెప్పారు. 

నిర్భయంగా చేయొచ్చు 
 డయల్‌-100 అంటే రక్షణ, భద్రత కల్పిస్తుందని అంతా గుర్తించాలి. ఏ విషయాన్నైనా క్షణాల్లో పోలీసులకు చేరవేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోయినా, పట్టణాల్లో, నగరాల్లో బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువగా విద్యార్థులు, యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 
- నర్సింహమూర్తి, కమాండ్‌ కంట్రోల్‌ సీˆఐ.

* హలో... పోలీసు అంకులా..!, రోజూ మా నాన్న తాగి వస్తాడు...అమ్మ తనను తిడుతోంది. ఎప్పుడూ రాత్రి పూట ఇద్దరూ గొడవే. నాకు నిద్ర పట్టడం లేదంటూ 10 ఏళ్ల బాబు డయల్‌-100కు ఇటీవల ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు.
* హలో...పోలీసులా.. మా వీధిలో ఇద్దరు కొట్టుకుంటున్నారు. వెంటనే రావాలి...మరో యువతి ఫోన్‌... 
---- ఇలా చాలా మంది డయల్‌-100కు ఫోన్లు చేస్తున్నారు. గతంలో ఒక అమ్మాయి తన తండ్రి పెడుతున్న ఇబ్బందులపై నేరుగా సమాచారం ఇవ్వడంతో అప్పటి ఎసీˆ్ప స్పందించి వెంటనే పోలీసులను పంపించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు....ఎవరైనా...ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా... కమాండ్‌ కంట్రోల్‌ విభాగంలోని డయల్‌-100కు ఫోన్‌ చేయమని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు ఫోన్‌ రాగానే పరిస్థితిని, సమస్యను, విపత్తును బట్టి సంబంధిత స్టేషన్లకు సమాచారం ఇస్తారు. అన్ని చెక్‌ పోస్టులకు, పెట్రోలింగ్‌ వాహనాలకు, రహదారి భద్రత వాహనాలకు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు విషయాన్ని చేరవేస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని