logo

వేస్తారా..వదిలేస్తారా..!

అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకూ ఇబ్బందే. రాళ్లు తేలిన రహదారులు, గతుకుల మార్గాలు. దశాబ్దాలుగా గిరిజన గ్రామాల రహదారుల దుస్థితి ఇది. సుమారు రెండేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో

Published : 20 Jan 2022 05:10 IST

కొమరాడ మండలంలోని కెమిశిల నుంచి గాజులగూడకు వెళ్లే దారి ఇది. ఐదు కి.మీ. మేర రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల కిందట పిక్క తెచ్చి వేశారు. ఇప్పటికి పనులు పూర్తి చేయలేదు. పిక్క రోడ్డుపైకి చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిశిల నుంచి గాజులగూడ, బందవలస, మర్రిగూడ, నాయుడువలస నుంచి లాబేసు వంతెన వరకు మొత్తం 13 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.2.29 కోట్లు మంజూరు చేశారు. బిల్లుల్ని ఆలస్యం చేస్తున్నారని గుత్తేదారు పనులు మధ్యలోనే ఆపేశారు.

ఈనాడు-విజయనగరం, పార్వతీపురం/గ్రామీణం, కొమరాడ, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకూ ఇబ్బందే. రాళ్లు తేలిన రహదారులు, గతుకుల మార్గాలు. దశాబ్దాలుగా గిరిజన గ్రామాల రహదారుల దుస్థితి ఇది. సుమారు రెండేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో రోడ్లు వేయడానికి సిద్ధమవ్వడంతో కష్టాలు తీరుతున్నాయని గిరిజనులు సంబరపడ్డారు. కొన్ని గ్రామాలకు తారురోడ్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. పూర్తి చేయకుండానే వాటిని మధ్యలోనే ఆపేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు కొన్ని సాంకేతిక లోపాలు అవరోధంగా మారాయి.

పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో సుమారు 400 గ్రామాలకు రహదారులు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 225 చోట్ల పనులకు 40 ఎంఎం మెటల్‌ వేశారు. ఇలా 80 వరకు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కొన్నింటికి ఎటువంటి చెల్లింపులు చేయకపోవడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రహదారులను ఒక క్రమంలో అభివృద్ధి చేయాలనేది కేంద్రం లక్ష్యం. ముందుగా రహదారి సౌకర్యం లేని చోట్ల రోడ్లను వేసి, తర్వాత వాటిని దశల వారీగా మట్టిదారులుగా.. తారు రోడ్లుగా మార్చాలని నిర్ణయించారు. మూడో దశకు వచ్చే సరికి చాలాచోట్ల పనులు నిలిచిపోయాయి. తారురోడ్లు వేయకుండా వదిలేశారు. నిధులు లేకపోవడంతో ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రోడ్లను మెరుగుపరచడానికి కేవలం రూ.50 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. ఈ నిధులు కిలోమీటరు రహదారిని బీటీగా మార్చడానికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాటిని ముట్టుకోలేకపోయారు. ఫలితంగా డబ్ల్యూబీఎం రహదారులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం: ఏజెన్సీ ప్రాంతంలోని మార్గాలను తారు రోడ్లుగా మార్చడానికి వీలున్న వాటిని గుర్తించి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. ఆగినవన్నీ తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరుతున్నాం. ఐటీడీఏ పీఓ నుంచి అనుమతులు తీసుకొని పనులు పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. - జె.శాంతీశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు, గి.సం.ఇంజినీరింగు విభాగం.

పార్వతీపురం మండలంలోని చొక్కాపువానివలస నుంచి గంగమాంబాపురానికి రూ.1.83 కోట్లతో రోడ్డు పనులు 2000 నవంబరులో ప్రారంభించారు. ఖానాలు, మట్టి, రాతిపరుపు పనులు 2021 ఫిబ్రవరికే పూర్తిచేశారు. తరువాత గుత్తేదారు తారు వేయకుండా చేతులెత్తేశారు. ప్రస్తుతం ఆ మార్గం రాళ్లు తేలి ప్రయాణించాలంటే భయమేస్తోంది. ఇదే మండలంలోని తేలునాయుడువలస నుంచి మునక్కాయవలస, కవిటిభద్ర ఆర్‌ అండ్‌ బి నుంచి డి.ములగ, డోకిశీల రోడ్డు నుంచి గెంజిగెడ్డ రహదారులదీ ఇదే పరిస్థితి.

కురుపాం మండలంలోని పొడి నుంచి ఒప్పంగికి వెళ్లే దారి. సుమారు రెండు కి.మీ. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పిక్క తెచ్చి వదిలేశారు. రెండేళ్లు పనులు చేయకపోవడంతో కొందరు పిక్కను తరలించేస్తున్నారు. గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని