logo

జనవరి జీతాలొస్తాయో.. లేదో!!

ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. కొత్త పీఆర్‌సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా శాఖ ఉద్యోగులు శుక్రవారం స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు వస్తాయా, రావా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది

Published : 22 Jan 2022 05:45 IST

ఉద్యమ బాటలో ట్రెజరీ ఉద్యోగులు


డీడీ గణేష్‌కు నోటీసు అందజేస్తున్న ఖజానా శాఖ ఉద్యోగ సంఘ నాయకులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. కొత్త పీఆర్‌సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా శాఖ ఉద్యోగులు శుక్రవారం స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు వస్తాయా, రావా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 25 వేల మంది, పింఛనర్లు 19 వేల మంది వరకు ఉన్నారు.

ప్రభుత్వం జీవోలు ఉపసంహరించుకునే వరకు తాము విధుల్లో పాల్గొనబోమని ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు పద్మనాభం, ముదిలి ఆదినారాయణ, పద్మావతి, రామకృష్ణ తదితరులు స్పష్టం చేశారు. ఇదే విషయమై ఉద్యోగులతో సమావేశమైన వీరు.. కొత్త పీఆర్‌సీ వల్ల ఉన్న జీతంలో కోత పడుతుందని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతామని వెల్లడించారు. అనంతరం ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎస్‌ఆర్‌కే గణేష్‌కు నోటీసు అందజేశారు. డీడీవోల నుంచి పీఆర్‌సీ జీతాల స్వీకరణ, ఆన్‌లైన్‌ డేటా సమర్పించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు యుగంధర్‌, కిరణ్‌కుమార్‌, ఏపీ ఎన్జీవో నాయకులు జగదీష్‌ పాల్గొన్నారు.

ఫిట్‌మెంట్‌ అమలు చేస్తారా..

ముఖ్యమంత్రి ప్రకటించిన 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు అమలు చేస్తారా? లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.అప్పలసూరి, బి.కాంతారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. 8, 9వ పీఆర్‌సీలో ప్రకటించిన విధంగా మినిమం బేసిక్‌ పే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.


కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని