logo

దొరికేసారూ

గజపతినగరానికి చెందిన ఓ మహిళ పీజీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. మార్కుల ఆధారంగా చూస్తే ఉద్యోగం ఖాయం. కానీ ఆమె ఎక్కడా బోధించకపోవడంతో అనర్హురాలు. దీంతో ఆ మహిళ ఓ విద్యాసంస్థలో మూడేళ్లుగా బోధిస్తున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఈ విషయం విచారణలో తేలింది

Published : 22 Jan 2022 05:45 IST


దరఖాస్తులు పరిశీలిలస్తున్న అధికారులు (పాత చిత్రం)

గజపతినగరానికి చెందిన ఓ మహిళ పీజీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. మార్కుల ఆధారంగా చూస్తే ఉద్యోగం ఖాయం. కానీ ఆమె ఎక్కడా బోధించకపోవడంతో అనర్హురాలు. దీంతో ఆ మహిళ ఓ విద్యాసంస్థలో మూడేళ్లుగా బోధిస్తున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఈ విషయం విచారణలో తేలింది.

బొబ్బిలికి చెందిన ఓ యువకుడు ఎవరూ గుర్తించరనే ధీమాతో మరో మండలంలోని కళాశాలలో నాలుగేళ్లు అధ్యాపకునిగా పనిచేసినట్లు దరఖాస్తుకు ధ్రువీకరణ పత్రం జతపరిచాడు. అధికారులు విచారించగా.. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని యాజమాన్యం చెప్పింది.

ఈనాడు-విజయనగరం: ఉద్యోగం కోసం లేని అర్హతలను జతపర్చారు. వేల మందిలో తమను ఎవరు పట్టించుకుంటారనే ధీమాతో ఉన్నారు. కానీ అధికారుల విచారణలో బండారం బయటపడింది.

జిల్లాలోని 33 కేజీబీవీల్లో 132 పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌), సీఆర్టీ (కమ్యునిటీ రిసోర్స్‌ టీచర్‌), ప్రిన్సిపల్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2438 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 272 మందితో అర్హుల జాబితాను రూపొందించారు. ఈ ఉద్యోగానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో రెండేళ్ల బోధించి ఉండాలి. ఇందుకు సంబంధించి కళాశాల నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. 60 నుంచి 70 శాతం మంది అభ్యర్థులు అసలు బోధించకుండానే నకిలీ పత్రాలు జతపరిచినట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది నెట్‌ సెంటర్లో తయారు చేయించినట్లు తేలింది.

పరిశీలనకు త్రిసభ్య కమిటీ

అభ్యర్థుల అనుభవ ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపట్టారు. ఇందుకు కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశాల మేరకు ప్రతి మండలానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మండల విద్యాశాఖాధికారి మెంబర్‌ కన్వీనర్‌గా, స్థానిక కేజీబీవీ ప్రిన్సిపల్‌, ప్రభుత్వ అధ్యాపకుడు సభ్యులుగా ఉన్నారు. వీరు ఆయా మండలాల నుంచి జారీ అయిన పత్రాలు సంబంధిత యాజమాన్యమే ఇచ్చిందా.. లేదా.. అక్కడ పని చేశారా.. లేదా అనే వివరాలు సేకరించారు. దరఖాస్తుదారులు అందరివీ కాకుండా అర్హుల జాబితాలోని వారిపైనే అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కమిటీలు తమ నివేదికలను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాయి. తప్పుడు పత్రాలు సమర్పించిన వారి వివరాలు త్వరలోనే బయటపెట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

నిజమేనని తేలింది: ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగనివ్వం. అర్హుల జాబితాలోని అభ్యర్థుల బోధన అనుభవ ధ్రువీకరణ పత్రాలు నిజమైనవో.. కావో విచారణ చేయించాం. ఇప్పటికే నివేదికలు వచ్చాయి. కొందరు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలింది.మార్కుల ఆధారంగా ప్రతిభను గుర్తిస్తున్నాం. - స్వామినాయుడు, అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్ష

ఇతర జిల్లాలకు వెళ్లి..

స్థానికేతర కోటాలోనూ శ్రీకాకుళం నుంచి 14 మంది, విశాఖ 09, ఇతర జిల్లాలకు చెందిన నలుగురు అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఆయా జిల్లాలకు సమీప మండలంలోని కమిటీ సభ్యులను విచారణకు పంపించారు. దూరప్రాంతంలో ఉన్న జిల్లాలకు సంబంధించి ఫోన్‌లో ఆధారాలు సేకరించారు. కొందరు అంత దూరం ఎవరు వచ్చి పరిశీలిస్తారనే ధీమాతో తప్పుడు పత్రాలు జతపరిచినట్లు తెలుస్తోంది. అధికారులు ముందే అప్రమత్తం కావడంతో అర్హులకు మేలు జరుగుతుందని పలువురు అభ్యర్థులు అంటున్నారు. కేవలం అర్హుల జాబితా ఆధారంగా కాకుండా దరఖాస్తుదారులందరివీ పరిశీలించాలని, అధికారులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోస్టు ఖాళీలు దరఖాస్తులు అర్హులు

పీజీటీ  114  1066 257

సీఆర్టీ  16  1171 15

ప్రిన్సిపల్‌  02  201 --

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని