logo

నమ్మించారు.. నట్టేటా ముంచారు

1224.. కొత్త వరి వంగడం.. చాలా మంచి రకం. దిగుబడి బాగా వస్తుంది. ఇదీ వ్యవసాయ అధికారుల మాట. అంతే జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న రైతులకు ఆ రకం విత్తనం అందించగా మొత్తం 4500 ఎకరాల్లో పండించారు. ఎన్నో ఆశలతో వేయగా 60 వేల టన్నుల దిగుబడి వచ్చింది. తీరా

Published : 22 Jan 2022 05:45 IST

1224 రకం ధాన్యం కొనక ఇక్కట్లు

జామి, న్యూస్‌టుడే: 1224.. కొత్త వరి వంగడం.. చాలా మంచి రకం. దిగుబడి బాగా వస్తుంది. ఇదీ వ్యవసాయ అధికారుల మాట. అంతే జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న రైతులకు ఆ రకం విత్తనం అందించగా మొత్తం 4500 ఎకరాల్లో పండించారు. ఎన్నో ఆశలతో వేయగా 60 వేల టన్నుల దిగుబడి వచ్చింది. తీరా అమ్ముకోవడానికి రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తే ఈ రకం అప్పుడే కొనుగోలు చేయవద్దని అధికారులు తెలిపారని.. కొనలేమని అక్కడి సిబ్బంది అంటున్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క జామి మండలంలోనే దాదాపు 270 ఎకరాల్లో ఈ రకాన్ని విత్తారు. చాలామంది రైతులు ఆర్బీకేలకు తిరిగి తిరిగి చేసేది లేక పురులు కట్టి అందులో నిల్వ చేశారు. మరికొందరు ఏ రోజైనా కొనరా అని సంచుల్లో వేసి బస్తాలు సిద్ధంగా ఉంచారు. ఈ రకం ధాన్యం ముక్క అయిపోతుందని.. బియ్యం దిగుబడి రావడం లేదని జిల్లాలో ఏ మిల్లరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈక్రమంలో అన్నదాతల నుంచి ఎలా తీసుకోవాలో.. ఎవరికి అమ్మాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చాలా మంది తమ ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ నుంచి మండల స్థాయి అధికారుల వరకు అడుగుతున్నా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో కర్షకులు అప్పుల పాలయ్యేలా ఉన్నారు.

207 బస్తాలు ఉన్నాయి..

నేను అధికారుల మాట విని కొత్త రకం విత్తనం కదా అని 11 ఎకరాల్లో వేశా. మొత్తం 207 బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మేందుకు రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా సరైన సమాధానం ఉండటం లేదు. రైతు సలహా మండలి అధ్యక్షుడిగా నేను వేయడమే కాకుండా మండలంలో చాలా మందితో ఈ విత్తనం నాటించాను. వారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నా. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలి.- గేదెల రమణబాబు, రైతు, భీమసింగి,జామి మండల రైతు సలహా మండలి అధ్యక్షుడు

జేసీ దృష్టికి తీసుకెళ్లాం

జిల్లాలో 1224, మరికొన్ని సన్నాలు కలిపి 60 వేల టన్నులు ధాన్యం ఉంది. వీటిని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. ఈ సమస్యను జేసీ దృష్టికి రాతపూర్వకంగా తెలియజేశాం. ఆయన ఆదేశాల మేరకు వీలైనంత త్వరలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

- టి.రామారావు, జేడీఏ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని