logo

గుండెల్లో గజరాజులు

జిల్లాలోని మన్యంలో నాలుగేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల గుంపు అక్కడి గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు గ్రామాల్లోకి వస్తాయో.. ఎక్కడ దాడి చేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తోన్న ఏనుగులు రెండు, మూడురోజులుగా గ్రామాల్లోకి వస్తుండడంతో

Published : 26 Jan 2022 06:22 IST

దుగ్గిలో సంచరిస్తున్న ఏనుగులు

పార్వతీపురం, కొమరాడ, న్యూస్‌టుడే : జిల్లాలోని మన్యంలో నాలుగేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల గుంపు అక్కడి గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు గ్రామాల్లోకి వస్తాయో.. ఎక్కడ దాడి చేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తోన్న ఏనుగులు రెండు, మూడురోజులుగా గ్రామాల్లోకి వస్తుండడంతో మన్యం వాసులు మరోసారి ఆందోళనబాట పట్టారు. మంగళవారం అర్తాం కూడలిలో పెద్దఎత్తున చేరడంతో తరలింపు అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.

 

ఏళ్లగా ఇక్కడే తిష్ఠ..

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి 1998లో జిల్లాలోని మన్యంలోకి అడుగుపెట్టిన గుంపు పలుమార్లు మకాం మార్చింది. చివరిగా 2018లో శ్రీకాకుళం జిల్లా నుంచి జియ్యమ్మవలస మండలంలోకి అడుగుపెట్టి ఎనిమిది ఏనుగులు అడుగుపెట్టి, ఇక్కడే తిష్ఠ వేశాయి. వీటిలో ఇప్పటికే మూడు మృత్యవాతపడగా, ఇటీవల ఓ పిల్ల జన్మించగా ప్రస్తుతం 6 ఏనుగుల గుంపు సంచరిస్తోంది.

ఎన్నో సవాళ్లు..

స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏనుగులను తరలించేందుకు అటవీశాఖాధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేటికీ శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. గుంపు జనావాసాల్లోకి రాకుండా గతంలో సాలూరు, కురుపాం రేంజ్‌ల పరిధిలోని జంతికొండ, జేకేపాడు ప్రాంతాల్లో ఎలిఫెంట్‌ జోన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. దాదాపు 1100 హెక్టార్ల అటవీ భూములను గుర్తించి, అక్కడే వాటిని ఉంచేలా ప్రణాళికలు వేశారు. అయితే వాటికి నిత్యం నీటి వసతి కల్పించాలి. ఒక్కోదానికి రోజు 200 నుంచి 300 కిలోల ఆహారాన్ని అందించాలి. దాదాపు 20 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ పెద్దమొత్తంలో ఖర్చవుతుండడంతో అటవీశాఖాధికారులు వెనకడుగు వేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోనూ జోన్‌ ఏర్పాటుకు యోచించినా, అక్కడి గిరిజనులు ఆందోళన చేపట్టడంతో విరమించుకున్నారు.

దాడులు ఇలా..

ఇప్పటివరకు ఏనుగుల దాడుల్లో 8 మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారారు.

అటవీశాఖాధికారులు నివేదిక ప్రకారం దాదాపు 3,500 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.

 

గ్రామాలను ఖాళీ చేయించి..

జోన్ల ప్రతిపాదన కాగితాలకే పరిమితం కావడంతో తోటపల్లి ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి, అక్కడ స్వేచ్ఛగా తిరగనీయొచ్చని భావించారు. కానీ స్థానికులు అడ్డుచెప్పడంతో అక్కడితోనే ఆగిపోయారు.

ఉద్రేకమే కారణం..

మొదట్లో గుంపు వచ్చినప్పుడు ఎక్కడా దాడులు జరిగేవి కాదు. కానీ వాటిల్లో ఉద్రేకం పెరుగుతుండడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. అలాగని వాటిని బలవంతంగా తరలించలేం. ముందుగా హరి అనే మగ ఏనుగును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కర్ణాటక అటవీశాఖ నిపుణులతో చర్చించాం. గజరాజులను తరలించకూడదని ఒడిశా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. జోన్ల ఏర్పాటు అంశాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. - త్రినాథరావు, మురళీకృష్ణ, అటవీ రేంజ్‌ అధికారులు

అర్తాం గదబవలసలో ధ్వంసమైన పైపులైన్లు

తరలిస్తారా.. లేదా?

సీపీఎం నాయకురాలిని స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌

కొమరాడ, న్యూస్‌టుడే: మన్యంలోని కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తోన్న ఏనుగుల గుంపును తరలించాలని గిరిజనులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం గుణానపురం, దుగ్గి, కళ్లికోట, అర్తాం, గంగరేగువలస, పరుశురాంపురం, కందివలస, కుమ్మరిగుంట తదితర ప్రాంతాల రైతులు అర్తాం కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. దుగ్గి, కళ్లికోట తదితర ప్రాంతాల్లో పోలీసులు అడ్డగించినా ఆందోళనకారులు వారిని తోసుకుంటూ కూడలికి చేరుకున్నారు. అక్కడ సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు రెడ్డి ఇందిరా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గజరాజుల సంచారంతో నాలుగేళ్లుగా నిద్రాహారాలు ఉండడం లేదని, నిత్యం భయంతో బతుకుతున్నామని వాపోయారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయామని, వాటిదాడుల్లో పదుల సంఖ్యలో చనిపోగా, వందలాది మంది క్షతగాత్రులుగా మారారన్నారు. ఈక్రమంలో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అటవీశాఖ రేంజ్‌ అధికారి మురళీకృష్ణ, తహసీల్దారు ప్రసాద్‌, పార్వతీపురం సీఐ విజయానంద్‌, ఎస్సై ప్రయోగమూర్తితో పాటు పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. గిరిజనులతో చర్చలు జరపగా, వారు ససేమిరా అనడంతో కొందరిని అరెస్టు చేసి కొమరాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వాహనాలను అడ్డుకోవడంతో మరికొందరిని తీసుకెళ్లారు. మరో నాలుగు నెలల్లో సమస్కను పరిష్కరిస్తామని రేంజర్‌ మురళీకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు.


అర్తాం కూడలిలో వాహనాలను అడ్డుకుంటున్న గిరిజనులు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని