logo

నిధులొచ్చాయ్‌.. పనులే తరువాయి

పార్వతీపురం డివిజనులో రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతుకుల మయమైన రహదారులపై వాహనాలు తిప్పడానికి చోదకులు సుడిమడతలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది.

Published : 27 Jan 2022 05:50 IST

గుత్తేదారుల్లో కదలిక 


కూనేరు-పార్వతీపురం రోడ్డు నాణ్యత పనులు పరిశీలిస్తున్న నాగమోహన్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం డివిజనులో రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతుకుల మయమైన రహదారులపై వాహనాలు తిప్పడానికి చోదకులు సుడిమడతలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు ఏడాది కిందటే నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు.
దాని ఊసే లేదు
తారురోడ్లకు ప్రతి ఐదేళ్లకోసారి పునర్నవీకరణ పూత(రెన్యువల్‌కోట్‌) వేయాలి. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియను పాటించకపోవడంతో గతుకుల మయంగా మారిపోయాయి. తారు రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోతుండడంతో గోతులు విస్తరించాయి. వీటిని పూడ్చేందుకు నిధులు లేక, తాత్కాలికంగా చేపట్టిన చర్యలు ఫలితం ఇవ్వలేదు. బీ మరోపక్క రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా రెండువైపుల బెర్మ్‌లు ఉంటాయి. వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు వంటివి ఉన్నచోట బెర్మ్‌లు ఎత్తుచేసి వాహనాల రాకపోకలకు అనువుగా మలచుకుంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు పాడవుతున్నాయని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.
అయినా వెనకడుగే..
* పార్వతీపురం డివిజనులోని రాష్ట్రస్థాయి ప్రధాన రహదారులు, జిల్లాస్థాయి ప్రధాన రోడ్ల మరమ్మతులకు గతేడాది ర.భ.శా నిధులు మంజూరుచేసింది. స్టేట్‌హైవే సమయానుకూలంగా నిర్వహించే పనులు చేపట్టడానికి రూ.38 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 126.6 కి.మీ రహదారిని మెరుగుపరచాలని ప్రతిపాదించారు. పనుల నిర్వహణకు టెండర్లను గత జూన్‌లో ఆహ్వానించి, ఏజెన్సీలను ఖరారు చేసినప్పటికీ సంబంధిత శాఖతో ఒప్పందాలు రాసుకోడానికి గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు.
* జిల్లాస్థాయి ప్రధాన రహదారుల మరమ్మతులకు రూ.38.59 కోట్లు మంజూరు అయ్యాయి. వీటితో 27 రోడ్లపై 189.63 కి.మీ పొడవున మరమ్మతులు చేయాలి. ఇందులో 17 రహదారుల పనులు ఇంకా ప్రారంభించలేదు. ఒక పని మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగిలిన వాటిలో పునఃటెండర్లు పిలవాల్సినవి కూడా ఉన్నాయి.

త్వరలోనే ప్రారంభిస్తాం: గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు వచ్చారు. త్వరలోనే ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కూనేరు రోడ్డు పనులు జరుగుతున్నాయి. మిగిలినవి ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం. - నాగమోహన్, కార్యనిర్వాహక ఇంజినీరు, ర.భ.శాఖ. పార్వతీపురం డివిజన్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని