logo

భయపెడుతున్నాయ్‌!

పాఠశాలల ఆవరణలో కాలంచెల్లిన, శిథిల భవనాలను తొలగించకుండే అలాగే వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. బడులకు వెళ్లే చిన్నారులు ఆటల సందడిలో అటుగా వెళ్తే.. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని చిన్నారుల తల్లిదండ్రులు

Published : 27 Jan 2022 05:50 IST

 పాఠశాలల ఆవరణలో శిథిల భవనాలతో ఆందోళన


 గజపతినగరం ఎస్సీ కాలనీలో కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనం 

గజపతినగరం, న్యూస్‌టుడే పాఠశాలల ఆవరణలో కాలంచెల్లిన, శిథిల భవనాలను తొలగించకుండే అలాగే వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. బడులకు వెళ్లే చిన్నారులు ఆటల సందడిలో అటుగా వెళ్తే.. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  వాటిని తొలగించకపోవడంతో భయపడుతున్నారు. 

* గజపతినగరం ఎస్సీ కాలనీలోని పాఠశాలలో ఆరు గదులకు గానూ ఒకటి శిథిలావస్థకు చేరింది. దీనిని తొలగించాలని మూడేళ్లుగా ఉపాధ్యాయులు అధికారులను కోరుతున్నారు. దీంతో పక్కనే ఉన్న రెండు గదుల్లోనూ తరగతులు నిర్వహించడం లేదు. అటు చిన్నారులు వెళ్లకుండా ఉపాధ్యాయులు నిత్యం కాపలా ఉంటున్నారు. మల్లునాయుడుపేట, జిన్నాం, గజపతినగరం పొట్లావారివీధి పాఠశాలల్లో ఇదే పరిస్థితి. 

* కొత్తవలస మండలంలోని రెల్లి, సాంభయ్యపాలెం, సంతపాలెం ప్రాథమిక పాఠశాల, కంటకాపల్లి ఆర్‌.ఎస్‌. ప్రాథమిక పాఠశాల భవానాలు పెచ్చులూడుతూ, పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిని ఆనుకుని ఉన్న భవనాల్లో చదువులకు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. తొలగించేందుకు ఎలాంటి చర్యలు లేవు. 

నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి... గజపతినగరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 248 పాఠశాలలు ఉండగా 48 తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. దత్తిరాజేరులో అధికంగా 17 భవనాలు కూల్చాల్సి ఉంది. ఎస్‌.కోట నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో మొత్తం 279 పాఠశాలలు ఉండగా, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు 72 వరకు ఉన్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు ముందుకురావడం లేదు.

పంచాయతీలకు తెలియజేశాం..
పాఠశాలల్లో పాడైన భవనాలు తొలగించేందుకు నిధులు వెచ్చించాలనే ఆదేశాలను పంచాయతీలకు అందించాం. వారితో పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీల్లో నిధుల సమస్యలు ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోంది.   -ప్రసాద్, డీఈఈ పీఆర్, గజపతినగరం 

 నిధుల కొరత...
భవనాలు మూడు, నాలుగేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్నట్లు ఇంజినీరింగు అధికారులు ధ్రువీకరించినా ఇప్పటికీ కూల్చడానికి చర్యలు లేవు. కూల్చి శిథిల వ్యర్థాలను ఇతర ప్రాంతాల్లో వేసేందుకు ప్రతి భవనానికి రూ.50 వేలు నుంచి రూ.లక్ష ఖర్చవుతుంది. భవనాలు తొలగించి అందులో వచ్చిన ఇనుము, కలప విక్రయించి పనులు చేయించాలని అధికారులు ఆదేశించారు. అంత మొత్తం రాకుంటే పంచాయితీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అందుకు నిధులు లేక పంచాయతీలు ముందుకురావడం లేదు. కొత్త భవనాలు మంజూరు చేస్తే ఆ స్థలాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకునేలా వాటిని తొలగించవచ్చని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని