logo

రెండు..పరిధి మెండు

కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి రాగా..  విజయనగరం రెండుగా విడిపోనుంది. అందరూ ఊహించినట్టే పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించనుంది. ఏ జిల్లా పరిధిలోకి ఏఏ మండలాలు వెళ్తున్నాయనే దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది. శ్రీకాకుళంలోని పాలకొండ, రాజాం నియోజకవర్గాలు కలవడంతో రెండు జిల్లాల వి

Published : 27 Jan 2022 05:50 IST

కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి రాగా..  విజయనగరం రెండుగా విడిపోనుంది. అందరూ ఊహించినట్టే పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించనుంది. ఏ జిల్లా పరిధిలోకి ఏఏ మండలాలు వెళ్తున్నాయనే దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది. శ్రీకాకుళంలోని పాలకొండ, రాజాం నియోజకవర్గాలు కలవడంతో రెండు జిల్లాల విస్తీర్ణం పెరగనుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న చీపురుపల్లి డివిజన్‌ కేంద్రం కాకపోవడంపై అందరూ నిరాశలో ఉన్నారు. -ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, పార్వతీపురం

చీపురుపల్లికి అవకాశం లేనట్టేనా?
విజయనగరం, బొబ్బిలిని రెవెన్యూ డివిజన్లు చేయనున్నారు.  చీపురుపల్లిని కూడా చేయాలనే డిమాండ్‌ 41 ఏళ్లుగా ఉంది. ప్రభుత్వం 1981లో చీపురుపల్లికి  ఆర్‌ఈసీఎస్‌ (రెస్కో) లేదా రెవెన్యూ డివిజన్‌ కావాలా అని అడిగింది. అప్పటి ప్రజాప్రతినిధులు రెస్కోకే మొగ్గు చూపారు. 1995 ఆగస్టు 19న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చీపురుపల్లి వచ్చినప్పుడు ప్రకటన చేసినా అమలుకు నోచుకోలేదు. 2003 సెప్టెంబరు 6న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రకటన చేయడంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. కార్యకలాపాల నిర్వహణకు భవనాలు కూడా పరిశీలించారు. తర్వాత ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడంతో మరుగున పడింది. ఐదేళ్ల కిందట రాష్ట్రంలో 18 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అందులో బొబ్బిలి, చీపురుపల్లి ఉన్నా పట్టాలెక్కలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ అవకాశం బొబ్బిలికి వచ్చింది.

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇందులో కలిపారు. రెండు ప్రాంతాల్లోని గిరిజనుల సంస్కృతుల్లో సారూప్యత ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. ఇందులో రెండు పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో, పార్వతీపురం, సీతంపేట మన్యం జిల్లాలోకి రానున్నాయి. సాధారణంగా జిల్లాకు ఒక ఐటీడీఏ ఉంటుంది. ఇప్పుడు రెండింటిని ఒకటి చేస్తారా.. ఒకవేళ అదే జరిగితే సీతంపేటను కొనసాగిస్తారా.. పార్వతీపురానికి మారుస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఉన్నందున.. సీతంపేటను ఐటీడీఏగా కొనసాగించాలనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు నియోజకవర్గాలు రిజర్వుడే కావడంతో ఇతర సామాజిక వర్గాలు రాజకీయాధికారంపై ఆందోళన చెందుతున్నాయి. 


నిర్మాణంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయం, కలెక్టరేట్‌ ఇక్కడే ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన  

* పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయానికి ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనే మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలనేది అధికారుల ఆలోచన. గతంలో అధికారులు దీన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం నిలిచిపోయింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయనే నేపథ్యంలో అప్పటికి భవనం పూర్తి కావడం అనుమానమే. 
* జిల్లా పోలీసు శాఖ కోసం వైకేఎం కాలనీలోని యువ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇందులో జిల్లా కీటకజనిత వ్యాధుల నివారణాధికారి కార్యాలయం, గోదాములు ఉన్నాయి. గృహ నిర్మాణ సంస్థకు చెందిన ఇనుము, సిమెంటు వంటివి భద్రపరుస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ సామగ్రి కూడా ఇక్కడే ఉంది.
* జిల్లా న్యాయస్థానానికి అవసరమైన వసతులు, వనరులు అందుబాటులో ఉన్నాయి. కొత్త భవనం నిర్మించడం, ఇక్కడే అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు కూడా నడుస్తుండడం    కలిసొచ్చే అంశాలు.

తగ్గిన విజయనగరం  
విశాఖ జిల్లాలోని గజపతినగరం, ఎస్‌.కోట, భోగాపురం తాలూకాలు, శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి తాలూకాలు కలిపి 1979 జూన్‌ 1న విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 34 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో మండలాల సంఖ్య 26కు తగ్గనుంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలు మన్యం జిల్లాలోకి వెళ్తుండగా.. కొత్తగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాలు చేరనున్నాయి. 

ఇతర శాఖల మాటేమిటి?
పార్వతీపురం డివిజన్‌ కేంద్రమే అయినా విద్యా శాఖ, తూనికలు కొలతల శాఖ కార్యాలయాలు బొబ్బిలిలో నడుస్తున్నాయి. అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా సముదాయాన్ని నిర్మించడానికి ఐదెకరాల స్థలాన్ని గుర్తించాలని గత కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త శాఖల కోసం అద్దె భవనాలు చూడాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని