logo

చెత్త చిక్కులు

చెత్త.. ఇదో పరిష్కారం దొరకని సమస్యగా మారుతోంది. ప్రణాళికా లోపం.. నిధుల కొరత.. నిర్వహణ లేమి కారణంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘాలను

Published : 20 May 2022 04:24 IST

పురాలకు భారంగా వాహనాల నిర్వహణ


విజయనగరం దాసన్నపేటలోని ట్రాన్సఫర్‌ స్టేషన్‌ వద్ద చెత్తను లారీలో పోస్తున్న దృశ్యం

ఈనాడు - విజయనగరం, విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే చెత్త.. ఇదో పరిష్కారం దొరకని సమస్యగా మారుతోంది. ప్రణాళికా లోపం.. నిధుల కొరత.. నిర్వహణ లేమి కారణంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘాలను ఎంపిక చేసి చెత్త సేకరణ, తరలింపునకు వాహనాలు అందించారు. వాటి నిర్వహణకు ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగా గతేడాది నవంబరు నుంచి ప్రారంభించారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. డబ్బులు కట్టిన వారికి వెంటనే రశీదు ఇవ్వడం లేదు. తర్వాత చరవాణికి సంక్షిప్త  సందేశం పంపిస్తున్నారు. కొందరికి అదీ రావడం లేదు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ-పోస్‌ యంత్రాలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు అధికారులు ఇండెంట్‌ పెట్టారు.
గాలికి వదిలేసినట్టేనా?
రెండు పట్టణాల్లో చెత్త నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. వాహనాలతో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డులో కలిపేస్తున్నారు. ఇంటింటికీ సుమారు 1.98 లక్షల ప్లాస్టిక్‌ బుట్టలు పంపిణీ చేశారు. విజయనగరంలో నాలుగు గార్బేజ్‌ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో దానికి రూ.80 లక్షలు కేటాయించారు. ఇప్పటికి ఒక్కటీ పూర్తి కాలేదు.
సాధారణ నిధులకు ఎసరు
ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు కాకపోవడంతో వాహనాల నిర్వహణ మొత్తాలను సాధారణ నిధుల నుంచి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరంలో ఏడాదికి సుమారు రూ.34 కోట్ల సాధారణ నిధులు ఉంటుండగా.. ఇందులో సుమారు రూ.32 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. పార్వతీపురంలో రూ.4.50 కోట్ల వరకు ఉండగా.. రూ.3.50 నుంచి రూ.4 కోట్ల వరకు వెచ్చిస్తుంటారు. ఇలాంటప్పుడు చెత్త బళ్లకు నిర్వహణ బిల్లులు ఎలా సమకూర్చాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

ఎందుకు కట్టాలి.. 
గతంలో మాదిరిగానే చెత్త సేకరిస్తున్నారు. ఎలాంటి మార్పు లేదు. అలాంటప్పుడు ఎందుకు పన్ను కట్టాలి. దీనిపై పారిశుద్ధ్య సిబ్బందితో ప్రతి నెలా గొడవలు జరుగుతున్నాయి.             
- బుగత రమాదేవి, మద్దాలవారి వీధి, పార్వతీపురం

పింఛను నుంచి తీసుకున్నారు.. 
మా కుటుంబ సభ్యులు చిన్నచిన్న పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మాలాంటి పేద వారిని కూడా చెత్త పన్ను కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చేది. డబ్బులు ఇవ్వకపోతే నాకొచ్చే సామాజిక పింఛను నుంచి మినహాయించుకొని ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం.- కర్రోతు రమణ, ముచ్చెరువు గట్టు, విజయనగరం

తలకు మించిన భారం
* విజయనగరానికి 63 వాహనాలు వచ్చాయి. ఒక్కో దానికి నెలకు రూ. 64,500 చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 4.87 కోట్ల భారం నగరపాలక సంస్థపై పడుతోంది. దీంతో ప్రస్తుతం తొమ్మిది వాహనాలు పక్కన పెట్టేశారు.  మిగిలిన వాటితో పాటు గతంలో ఉన్న వాహనాలకు కలిపి 46 వరకు ఉన్నాయి. వీటికి నెలకు డీజిల్‌కు రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది. 

* పార్వతీపురంలో 16 వాహనాలు ఉండగా ఒక్కో దానికి నెలకు రూ. 62 వేల చొప్పున చెల్లించాలి. ఏడాదికి రూ.1.19 కోట్లు అవుతుంది. ఈ భారంతో ఐదు వాహనాలను పక్కన పెట్టేశారు. గతంలో అన్నీ కలిపి ఎనిమిది వాహనాలు ఉండగా.. ఒక్కో దానికి డీజిల్, జీతాలు, నిర్వహణ ఖర్చులు రూ.35 వేల వరకు అయ్యేవి. ఏడాదికి సుమారు రూ.33.60 లక్షలతో సరిపోయేది. 

ప్రజలు సహకరించాలి 
పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ప్రజలు అధికారులకు సహకరించాలి. పన్ను చెల్లిస్తే నిర్వహణ సమర్ధంగా చేయొచ్చు. త్వరలో సచివాలయ కార్యదర్శులకు ఈపోస్‌ యంత్రాలు అందిస్తాం. వెంటనే రశీదు ఇస్తారు. పన్ను వసూలు పెంచి వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. - సీహెచ్‌వీవీఎస్‌ బాపిరాజు,  ప్రాంతీయ సంచాలకుడు, విశాఖ రీజియన్‌ 

 విజయనగరంలో
*నవంబరులో 61.93 శాతం పన్ను వసూలు కాగా.. మార్చిలో 8.01 శాతమే వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

 పార్వతీపురంలో
*  నవంబరులో 76.03 శాతం, మార్చిలో 18.45 శాతం వసూలైంది. దీంతో గతంలో సచివాలయ సిబ్బందికి వార్డుల వారీగా లక్ష్యాలను విధించారు. వాటిని చేరుకోకపోతే విధుల నుంచి తప్పిస్తామని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని