logo

పెట్రోలు, డీజిల్‌కు కోత

ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్‌ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్‌ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు.

Published : 20 May 2022 04:22 IST

 బంకుల్లో నిండుకుంటున్న నిల్వలు

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్‌ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్‌ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు. తర్వాత తెరిచి కంపెనీ సొంత అవుట్‌లెట్‌లకు మాత్రమే 25-30 వరకు లోడులు పంపినట్లు తెలిసింది. తర్వాత డీలర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక్కో జిల్లాకు కేవలం 5-6 లోడుల చొప్పున సరఫరా చేసింది. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాలకు కనీసం ఒక్క లోడు కూడా రాలేదు. ముందు రోజు డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయలేదని ఓ పెట్రోలు బంకు యజమాని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. గురువారం రాత్రికో, శుక్రవారం ఉదయానికో తమ వద్దనున్న నిల్వలు పూర్తిగా నిండుకుంటాయని వివరించారు. 
తెరపైకి రేషన్‌ విధానం 
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 147 వరకు వివిధ బంకులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం సరఫరా ఆగిన సదరు కంపెనీ బంకులు 32 వరకు ఉంటాయి. వీటి డీలర్లు ఒక లోడు (12 వేల లీటర్లు)కు రూ.14 లక్షలు కట్టి పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేస్తుంటారు. గతంలో ముందుగా డబ్బులు చెల్లించకపోయినా కంపెనీలు సరఫరా చేసేవి. తర్వాత అడ్వాన్స్‌ విధానం తీసుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్‌ కోటా అంటూ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. గత డిసెంబరులో ఎంతయితే బంకుల్లో వినియోగం అయిందో అందులో 80 శాతమే ఇస్తామంటూ మెలిక పెట్టాయి. గత నెలలో లక్ష లీటర్లు విక్రయిస్తే.. ఇప్పుడు కేవలం 80 వేల లీటర్లే ఇస్తామని చెబుతున్నాయి. ఆ కోటా దాటిపోతే ఈ నెలకు ఇక ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారని బంకుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కోటా విషయం నెల మొదటి వారంలో చెబితే ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని.. ఇప్పటికిప్పుడు చెబితే వ్యాపారం ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. అడ్వాన్స్‌ ఇస్తున్నా లోడులు పంపించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బంకుల యజమానులంతా శుక్రవారం విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారిని కలసి తమ సమస్య విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని