logo

వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు

జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం

Published : 21 May 2022 04:27 IST


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన, మండలి ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు,
 కలెక్టర్‌ సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు, అధికారులు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యం సేకరణలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి స్పందిస్తూ జిల్లా విభజన వల్ల ఎక్కువ రైస్‌మిల్లులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నందున ఇక్కడ వాటి సంఖ్య తగ్గిందని, కొత్తగా మిల్లుల ఏర్పాటుకు ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయిస్తుందని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ప్రోత్సహిస్తామని, వరికి బదులుగా వేరుశెనగను ప్రోత్సహించాలని జడ్పీ ఛైర్మన్‌ సూచించారు. కదిరి-లేపాక్షి, నిత్య హరిత రకాలను ప్రోత్సహించేలా శాస్త్రవేత్తలతో కార్యశాలలు నిర్వహించి సలహాలు అందించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గేదెల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ-పంట నమోదుపైనే రైతు భవిష్యత్తు ఆధారపడి ఉన్నందున ఆ ప్రక్రియ వంద శాతం చేపట్టాలన్నారు. 

జిల్లా నీటి పారుదల కమిటీ సమావేశంలో ఛైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు నీరు విడుదల చేసేలోగా జైకా నిధులతో చేపడుతున్న పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. జూన్‌ 15 నాటికి మడ్డువలస నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈ రాంబాబు వివరించారు. మడ్డువలసకు రూ.6.5 లక్షలతో చేపడుతున్న మరమ్మతులు మే ఆఖరుకు పూర్తి చేస్తామన్నారు. తాటిపూడి, ఆండ్ర నీటిని జులై 15న విడుదల చేస్తామన్నారు. సమావేశంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముద్రించిన పంటల సాగులో కీలక యాజమాన్య పద్ధతులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జేసీ మయూర్‌ అశోక్, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కంబాల జోగులు, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ భావన, కమిటీ సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని