logo

అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్‌!

రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ నెల్లిమర్లలో చేపట్టదలచిన కొవ్వొత్తుల ర్యాలీకి చీపురుపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్న తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు.

Published : 23 May 2022 04:13 IST

తెదేపా నిరసన ర్యాలీలో కిమిడి నాగార్జున

చీపురుపల్లిలో ఉద్రిక్తత

చీపురుపల్లిలో తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు నాగార్జునను

అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళుతున్న పోలీసులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ నెల్లిమర్లలో చేపట్టదలచిన కొవ్వొత్తుల ర్యాలీకి చీపురుపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్న తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కారులో బయలుదేరిన ఆయన్ని పట్టణంలోని కొత్తగవిడివీధిలో ఆపి నిరసనకు అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సీఐ జి.సంజీవిరావు, ఎస్సై ఎ.సన్యాసినాయుడు సూచించారు. తాను నిరసన చేపడతానని, అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ఆవేదన తెలిపే హక్కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు. అర గంట పాటు చర్చలు జరిపాక నాగార్జునను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నాగార్జున, పార్టీ నాయకులుఫ రౌతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్‌కుమార్‌, ముల్లు రమణ, గవిడి నాగరాజు తదితరులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

నినాదాల హోరు

ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. నాగార్జునను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించడంతో ఎవర్నీ ముందుకు వెళ్లనీయకుండా పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు వారిని పక్కకు నెట్టి స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాయకుల అరెస్టుల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా శ్రేణుల నినాదాలతో ప్రధాన రహదారి హోరెత్తింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అరెస్టులకు భయపడేది లేదని, అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, కొన్ని రోజుల కిందట నాలుగు రహదారుల కూడలిలో మంత్రి బొత్స హాజరైన రెవెన్యూ డివిజన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరు అనుమతి ఇచ్చారని, అధికార పార్టీకి ఒక న్యాయం... తెదేపాకు మరో న్యాయమా...? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటీవల ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారని, వైకాపా ప్రభుత్వం, పెద్దల అండదండలతోనే రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.

కాగడాల ప్రదర్శన భగ్నం

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో దళితులపై దాడులకు నిరసనగా నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం తెదేపా తలపెట్టిన కాగడాల ప్రదర్శనను పోలీసులు భగ్నం చేశారు. ముందస్తుగా దిగ్బంధించారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడ్ని విజయనగరంలోని నివాసంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నెల్లిమర్ల కేంద్రంలో కార్యక్రమానికి వెళ్లిన విజయనగరం నియోజకవర్గం ఎస్సీ విభాగం నేతలు పోలీసుల అరెస్టులతో మధ్యలో వెనుదిరగాల్సి వచ్చింది.

విజయనగరంలో గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు

చీపురుపల్లిలో కార్యకర్తను నెడుతున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని