logo

రహదారి ప్రమాదాలపై 15 రోజులకొకసారి సమీక్ష

రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. యువకులే ప్రాణాలొదులుతున్నారు. అస్తవ్యస్త రహదారులు, వేగ నియంత్రణ బోర్డులు లేకపోవడం, వాహన నైపుణ్య లేమి, అతివేగం, శిరస్త్రాణం ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి కారణాలున్నాయి.

Published : 23 May 2022 04:13 IST

ఐఆర్‌ఏడీ యాప్‌లో సమగ్ర సమాచారం

‘న్యూస్‌టుడే’తో ఉప కమిషనర్‌ శ్రీదేవి

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. యువకులే ప్రాణాలొదులుతున్నారు. అస్తవ్యస్త రహదారులు, వేగ నియంత్రణ బోర్డులు లేకపోవడం, వాహన నైపుణ్య లేమి, అతివేగం, శిరస్త్రాణం ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి కారణాలున్నాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా చోదకుల్లో మార్పు రావడం లేదని రవాణా శాఖ ఉప కమిషనర్‌ సీహెచ్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె ‘న్యూస్‌టుడే’తో పలు విషయాలు చెప్పారు.

కలెక్టర్‌ అధ్యక్షతన...: స్వీయతప్పిదాలు, చరవాణి లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం, మద్యం తాగి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన సమీక్షా సమావేశం ఇక నుంచి ప్రతి 15 రోజులకొకసారి నిర్వహిస్తాం. గతంలో ఎంపీ అధ్యక్షుడిగా జరిగే సమావేశాలు ఇక నుంచి కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిస్తాం. సమీక్ష ఫలితాలు తొందరగా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాం.

అన్ని విభాగాలతో యాప్‌: కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌ఏడీ యాప్‌ను తెచ్చింది. ప్రమాదాలకు సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. ఇందులో పోలీసు, ఇంజినీరింగ్‌, రవాణా, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌, 108 అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ యాప్‌లో ఉంటారు. ప్రమాదం ఎలా జరిగింది..? ఏ సమయంలో..? ఎందుకు..? చనిపోయిన వారి వివరాలు, వారికి అందుతున్న వైద్యం, అందించాల్సిన సేవలు ఇలా అన్నింటినీ పొందుపరుస్తారు. తదుపరి కార్యాచరణపై స్పష్టత వస్తుంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.

వాహనాల సీజ్‌..!

కొవిడ్‌ వల్ల చాలా మంది త్రైమాసిక పన్నులు చెల్లించలేదు. వారికి వెసులుబాటు ఇచ్చాం. పన్నులు, జరిమానాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని చెల్లించాలని అడుగుతున్నాం. 15 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనాలు సీజ్‌ చేస్తాం. ఇప్పటికే గ్రామాల వారీగా వాహనాల డేటా తీసుకుంటున్నాం.

చివర వరకూ వద్దు

గతంలో ప్రతి రాష్ట్రానికి రహదారి భద్రత కమిటీకి సంబంధించి ఒక విభాగం ఉండేది. ఇక నుంచి ఇవన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళ్తాయి. పరివాహక్‌ పేరిట సేవలు ప్రారంభమయ్యాయి.● జులైలో విద్యా సంస్థలు తెరవనున్నందున చివరి వరకూ వేచి ఉండకుండా ఇప్పటి నుంచే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు చేయించుకోవాలని చెబుతున్నాం. అలా లేకుండా రోడ్లు మీదకు వచ్చి వివాహాలకు, ఇతరత్ర కార్యక్రమాలకు బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సమాచారం చేరవేశాం. ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తాం. నియమ, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నట్లు అనిపిస్తే కఠిన చర్యలు తప్పవు.● సందేహాలుంటే కార్యాలయంలోని హెల్ప్‌డెస్కులు సేవలందిస్తాయి.

తీవ్ర ఇబ్బందులు:

జిల్లా విభజన వల్ల సాలూరు, పార్వతీపురం కేంద్రాలు మన్యం జిల్లాలోకి వెళ్లిపోయాయి. విజయనగరం జిల్లాకు ఒకే కేంద్రమే అయినందున రవాణా శాఖ సేవలకు చోదకుల ఇబ్బందులపైనా, హెవీడ్రైవింగ్‌ స్కూల్‌ గురించి ఉన్నతాధికారులతో మాట్లాడాం. ప్రస్తుతానికి రాజాం, రామభద్రపురం ప్రాంతాల్లో వారానికి రెండు రోజుల చొప్పున వాహనదారులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇద్దరేసి ఇన్‌స్పెక్టర్లను నియమించాం. ఇది పూర్తిగా గాడిలో పడేసరికి కొంచెం సమయం పడుతుంది. రాజాపులోవ వద్ద హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌కు స్థలాన్ని అప్పగించారు. బడ్జెట్‌ కేటాయించక నిర్మాణాలు జరగలేదు. ఆ స్థలంలో కొంత స్థలం కబ్జాకు గురైంది. దీని గురించి ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అటు నుంచి స్పందన బట్టి కార్యాచరణ అమలు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని