logo

భాజపా, వైకాపా వర్గాల మధ్య కొట్లాట

నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల  వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

Updated : 24 May 2022 06:31 IST

 బిర్యానీ విషయమై తగాదా..పలువురికి గాయాలు


  ఎస్‌ఐతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల  వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వైకాపా సానుభూతిపరుడు బిర్యానీ కోసం వెళ్లి గొడవ పడ్డాడు. భాజపా కార్యకర్తలు కొట్టడంతో అతనికి స్వల్పగాయాలయ్యాయి. దీనిపై బాధితుడు వార్డు కౌన్సిలర్‌ మైపాడ ప్రసాద్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన కార్యకర్తలతో కలసి అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో మళ్లీ దాడికి పాల్పడ్డారు. దాంతో ఆయన చేతికి గాయమైంది. ఈ విషయం తెలిసి వైకాపా కార్యకర్తలు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అందరిని చెదరగొట్టారు. ఈ ఘటనపై డీఎస్పీ త్రినాథరావు విచారణ జరిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు భాజపా ఫిర్యాదు
భాజపా కార్యకర్తలపై దాడి చేసినవారు ఎంతటివారైనా క్షమించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేశారు. దోషులను అదుపులోకి తీసుకోకపోతే పోలీసుస్టేషన్‌ వద్ద నిరసనకు దిగుతామన్నారు. తమ కార్యకర్తలపై దాడికి దిగినవారిని, మద్దతు పలికినవారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పి.మాధవ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, నాయకులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని