logo

సా..గుతోంది సర్వే

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన రీసర్వే నత్తనడకన జరుగుతోంది. మూడు విడతల్లో పూర్తి చేయాలని భావించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు.ఉమ్మడి జిల్లాల్లో 1953 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలి. రెండు విడతల్లో విజయనగరం

Updated : 24 May 2022 06:31 IST


నెల్లిమర్ల మండలం మొయిదలో సర్వే చేస్తున్న అధికారులు

ఈనాడు-విజయనగరం, విజయనగరం అర్బన్, కొత్తవలస, గజపతినగరం, నెల్లిమర్ల, న్యూస్‌టుడే భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన రీసర్వే నత్తనడకన జరుగుతోంది. మూడు విడతల్లో పూర్తి చేయాలని భావించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు.ఉమ్మడి జిల్లాల్లో 1953 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలి. రెండు విడతల్లో విజయనగరం జిల్లాలో 983 గ్రామాలకు 24 చోట్ల పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

*తొలి విడతలో పైలెట్‌ గ్రామాలైన రామభద్రపురం మండలం మర్రివలస, దత్తిరాజేరు మండలం లక్ష్మీపురంలో భూసర్వే పూర్తి చేశారు. సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ జరగడం లేదు. హద్దుల కోసం 2,514 రాళ్లు రాగా.. 1459 మాత్రమే పాతారు. లక్ష్మీపురంలో ఇది పూర్తి కాగా.. మర్రివలసలో ఏర్పాటు చేయాల్సి ఉంది. 

*రెండో విడతలో 15 మండలాల్లో 22 గ్రామాల్లో సర్వే చేసి తుది ప్రకటన జారీ చేశారు. మిగతా ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేయాలి. తొమ్మిది గ్రామాలకు 4,032 రాళ్లు రాగా.. 904 మాత్రమే పాతారు. 2022 డిసెంబరు నాటికి డ్రోన్‌ సర్వే పూర్తి చేయాలి. ఇప్పటివరకు 304 గ్రామాల్లో జరిగింది. 102 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు వచ్చాయి. 29 గ్రామాలకు 13 నోటిఫికేషన్‌ ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ (ఓఆర్‌ఐ) పూర్తి చేశారు. అంతర్జాల  సమస్యలు, ప్రతికూల వాతావరణం  ఆటంకంగా మారుతోంది. 

ప్రక్రియ ఇలా..
వీఆర్వో, కార్యదర్శుల సమక్షంలో గ్రామ సర్వేయర్లు  హద్దులు నిర్ణయిస్తారు. రోవర్ల సాయంతో ప్రభుత్వ, రైతుల భూములకు అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తిస్తారు. అనంతరం సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్‌తో సర్వే చేసి చిత్రాలతో కూడిన పటాలను రూపొందిస్తారు. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ చేస్తారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను తహసీల్దారు, మండల సర్వేయరు పరిష్కరిస్తారు. వారిచ్చిన నివేదికను సర్వే శాఖ ఏడీ ధ్రువీకరించి ప్రభుత్వానికి పంపిస్తారు. ఆపై సరిహద్దు రాళ్లు వేసి, ప్రతి రైతు భూమికి ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్లు (ఎల్‌పీఎన్‌) ఇస్తారు. 

రాళ్ల సమస్య
సర్వే రాళ్లు ఉమ్మడి జిల్లాకు ఆరు లక్షల వరకు అవసరమని ప్రతిపాదించగా.. ఇందులో సగం కూడా రాలేదు. రెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి బై జంక్షన్, మూడు ఉంటే ట్రై జంక్షన్‌ సర్వే రాయి వేస్తారు. దీని బరువు ఒక్కోటి సుమారు 90 కిలోల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సర్వే నంబర్ల వారీగా వేసే వాటి బరువు 25 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. వీటిని పొలాల్లోకి తీసుకెళ్లడం సాధ్యం కావడం లేదు. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ బాధ్యతను వేరే ఏజెన్సీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే రాళ్లు రాలేదని అంటున్నారు. కొన్నిచోట్ల ఉపాధి వేతనదారులతో పనులు చేయిస్తున్నారు.

* గజపతినగరం మండలం డోలపాలెం రెవెన్యూ గ్రామంలో గతంలో 220.67 ఎకరాల భూమి ఉండగా.. సర్వేతో 43 సెంట్లు ఎక్కువగా వచ్చింది. రైతులకు కొలతలు వేసి, భూమి వివరాలతో కూడిన పత్రాలు అందించారు. రాళ్లు కొన్నిచోట్ల పాతాల్సి ఉంది. మండలంలో టీకేఎస్‌ పురం రామన్నపేట, భగీరథపురం గ్రామాల్లో సర్వే పనులు చేశారు. భూ యజమానులను భూమిపైకి తీసుకువెళ్లి నిజనిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. రాళ్లు పాతించడంతో పాటు పాసు పుస్తకాలు అందించాల్సి ఉంది. 

* కొత్తవలస మండలం రాయపురాజుపేటలో రీ సర్వే గతేడాది నవంబరు 17న చేపట్టారు.  300.83 ఎకరాలున్నట్లు గుర్తించారు. 152.66 ఎకరాలు జిరాయితీ, 88.15 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మరో 60.02 ఎకరాలు జాతీయ హరిత రహదారి భూ సేకరణలో పోయింది. ‘డి’ పట్టాలు ఉన్నాయి. గ్రామంలో భూముల హక్కుల రికార్డును తాజా పర్చడానికి డిప్యూటీ తహసీల్దార్‌/రికార్డింగ్‌ అథారిటీ ఎం.హర్షవర్ధిని నోటీసు జారీ చేశారు. రీ సర్వే కోసం ఈ గ్రామంతో పాటు సుందరయ్యపేటను మొదట్లో ప్రతిపాదించారు. సర్వే ఆఫ్‌ ఇండియా నుంచి రాయపురాజుపేటను ఎంపిక చేశారు. దీంట్లో హేబిటేషన్, ప్రభుత్వ భూముల గూగుల్‌ మ్యాప్‌ (డీఆర్‌ఐ) ప్రారంభంలో విఫలం కాగా ప్రాంతీయ ఉప సంచాలకురాలు  పరిష్కరించారు. మూడు బృందాలు సర్వే పూర్తి చేశాయి. డీఎల్‌ఆర్, మ్యూటేషన్లు పూర్తిచేసి సర్వే రాళ్లు వేయాల్సి ఉండగా ఇంకా రాలేదు.

* నెల్లిమర్ల మండలం మొయిదలో డ్రోన్‌తో సర్వే చేశారు. హార్డ్, సాఫ్ట్‌ కాపీలను సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపించారు. ఓఆర్‌ఐ ఫలితాలు సరిగా రాకపోవడంతో మరోసారి సర్వే చేశారు. మండలంలో 31 గ్రామాలకు 21 చోట్ల ముందుగా ఫ్రీ డ్రోన్‌ ప్లే చేశారు. 12 గ్రామాల్లో చేస్తున్నారు. 

వేగవంతానికి చర్యలు 
సర్వేను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డ్రోన్‌ సర్వేకు డిసెంబరు వరకు అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూదనే ఉద్దేశంతో పకడ్బందీగా చేస్తున్నాం. నెట్‌వర్క్‌ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరాం.- త్రివిక్రమరావు, సహాయ సంచాలకులు, భూములు, సర్వే శాఖ, విజయనగరం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని