బుడా.. ఎప్పటికీ బడా

బొబ్బిలి పట్టణ అభివృద్ధి అథారిటీ (బుడా) ఏర్పాటై మూడున్నర ఏళ్లు కాగా.. పాలకవర్గం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది. దీని పరిధి ఎక్కువగా ఉన్నా.. ఆదాయ వనరులకు కొదవ లేకపోయినా.. ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి అనేక కారణాలున్నాయి.

Updated : 04 Jun 2022 04:22 IST

ఈ ఏడాది సమకూరిన ఆదాయం

అభివృద్ధి ఛార్జీలు: రూ.72 లక్షలు

భవన నిర్మాణ అనుమతుల నుంచి: రూ. 96 లక్షలు

బొబ్బిలి పట్టణ అభివృద్ధి అథారిటీ (బుడా) ఏర్పాటై మూడున్నర ఏళ్లు కాగా.. పాలకవర్గం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది. దీని పరిధి ఎక్కువగా ఉన్నా.. ఆదాయ వనరులకు కొదవ లేకపోయినా.. ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. కీలకమైన ఉద్యోగులే లేరు. క్షేత్రస్థాయిలో తిరిగే సిబ్బంది కరవయ్యారు. దీని వల్ల బుడా పరుగులకు కళ్లెం పడుతోంది. పాలకవర్గం వచ్చాక కొన్ని దస్త్రాలు కదలడంతో కొంత ఆదాయం సమకూరింది. అదేపూర్తి స్థాయిలో పట్టుబిగిస్తే రూ.కోట్లలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బొబ్బిలి, న్యూస్‌టుడే: బుడా పరిధిలో 152 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పురపాలక సంఘాలతో పాటు రామభద్రపురం, నర్సిపురం, వెంకంపేట, దిబ్బగుడివలస, జగన్నాథపురం, అప్పయ్యపేట, మెట్టవలస, కొట్టక్కి ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశారు. వీటిని క్రమబద్ధీకరిస్తే బుడాకు రూ.10 కోట్లవరకు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకా 90 శాతం మేర అనధికార లేఅవుట్లు ఉన్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో ఏడు లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేశారు. వీటి నుంచి రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. అదే లెక్కన 152 లేఅవుట్లకు కనీసం రూ.10 కోట్ల మేర సమకూరుతుందని భావిస్తున్నారు. అయితే వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ అనుమతులు రావాలి. ఆపై రియల్‌ ఎస్టేట్ యజమానులు ముందుకు రావాలి. లేకుంటే కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పవు.

సిబ్బంది కొరతే ప్రధాన సమస్య

బుడా పరిధిలో అక్రమ కట్టడాలు, లేఅవుట్లను కట్టడి చేసేందుకు సిబ్బంది అవసరం. పూర్తిస్థాయిలో వివిధ కేడర్లలో 15 మంది వరకు అవసరం కాగా ఐదుగురే కనిపిస్తున్నారు. ఇటీవల జేసీ మయూర్‌ అశోక్‌ నేతృత్వంలో కార్యనిర్వాహక సమావేశం జరిగింది. కొన్ని పురపాలక సంఘాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకువచ్చేందుకు తీర్మానించారు. వారు ఏ మేరకు సంసిద్ధత వ్యక్తం చేస్తారో తెలియని పరిస్థితి. 13 మండలాలు, మూడు పురపాలక సంఘాల్లో పట్టణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరైనా అవసరం. ఆ స్థాయిలో ఉద్యోగులు లేరు. కార్యదర్శి, పీవో, సర్వేయర్లు ఇద్దరు, కంప్యూటర్‌ ఆపరేటర్లు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన సిబ్బందిని నియమించుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. దీనికి తాజాగా దస్త్రాలను సిద్ధం చేశారు. 

ప్రత్యేక మార్కు ఏదీ

బుడా 2019, ఫిబ్రవరి 12న ఏర్పాటైంది. మూడున్నర ఏళ్లు అవుతున్నా అభివృద్ధిపరంగా ప్రత్యేక మార్కు చూపలేదు. బుడా పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకుని పట్టణీకరణ దిశగా అభివృద్ధి చేయాల్సి ఉంది. పార్కులు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, కోనేరులు, చెరువుల సుందరీకరణ, బోటు షికార్లు ఏర్పాటు చేసి పట్టణ, మండల కేంద్రాల వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. ఆ దిశగా ఇంత వరకు అడుగులు పడలేదు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతుల జారీ నుంచి వస్తున్న ఆదాయంలో సుందరీకరణకు కేటాయించాల్సి ఉండగా ఎక్కడా జరగలేదు. బుడా పరిధిలో ఉమ్మడి జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి పురపాలక సంఘాలు, 13 మండలాలు ఉన్నాయి. 

ప్రభుత్వానికి నివేదించాం  

సిబ్బంది కొరత ఉంది. పూర్తిస్థాయిలో భర్తీచేయాలని ప్రభుత్వానికి నివేదించాం. అన్నిచోట్లా సమగ్ర సర్వే నిర్వహించి అనధికార లేఅవుట్లు గుర్తించి రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశాం. క్రమబద్ధీకరించకుంటే ప్లానులు మంజూరు చేస్తాం. దీనివల్ల బుడాకు అదనపు ఆదాయం సమకూరుతోంది.

- పద్మజ, పీవో, బుడా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని