logo

కబంద హస్తం

చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని కాపాడుకుంటే ఊరొక్కటే కాదు.. వ్యవసాయం, భూగర్భ జలాలు, పశువులు బాగుంటాయి. ఇప్పుడు అవి ఆక్రమణదారుల చేతికి చిక్కుతున్నాయి. గ్రామాల్లో సాగు భూములుగా.. పట్టణాల్లో నిర్మాణాలుగా మారిపో తున్నాయి. యంత్రాంగం సైతం వీటిని సంరక్షించడంలో విఫలమవుతోంది.

Updated : 01 Jul 2022 04:27 IST

ఈనాడు-విజయనగరం, రాజాం, గజపతినగరం, శృంగవరపుకోట, న్యూస్‌టుడే

చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని కాపాడుకుంటే ఊరొక్కటే కాదు.. వ్యవసాయం, భూగర్భ జలాలు, పశువులు బాగుంటాయి. ఇప్పుడు అవి ఆక్రమణదారుల చేతికి చిక్కుతున్నాయి. గ్రామాల్లో సాగు భూములుగా.. పట్టణాల్లో నిర్మాణాలుగా మారిపో తున్నాయి. యంత్రాంగం సైతం వీటిని సంరక్షించడంలో విఫలమవుతోంది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,183 చెరువులు ఉండగా.. వీటి కింద సుమారు 89,762 హెక్టార్లు సాగవుతోంది. రానురానూ ఇది తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఆక్రమణలే. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ రీ సర్వే జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పూర్తయింది. చాలాచోట్ల ఆక్రమణలకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే చెరువు గర్భాలు, ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల చెర నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పదేళ్ల కిందట చెరువుల హద్దులు గుర్తిస్తూ కందకాలు తవ్వారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేయడంతో యథాస్థితికి వచ్చాయి.

లోపించిన సమన్వయం

జల వనరులు, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయలోపం కారణంగా చాలా వరకు అన్యాక్రాంతమవుతున్నాయి.   ఎవరికి వారు తమకు ఎందుకులే అన్నట్లు ఊరుకుంటున్నారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే హడావుడి చేయడం.. తరువాత వదిలేయడం జరుగుతోంది. కొన్ని చోట్ల శాశ్వత నిర్మాణాలు చేస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో చెరువులు బాగు చేస్తున్నా కబ్జాల జోలికి వెళ్లడం లేదు. ఒక్క గంట్యాడ మండలంలోనే సుమారు 14 ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉపాధి హామీలో చెరువులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా 77 గుర్తించారు. ఇక్కడ కేవలం అభివృద్ధితోనే వదిలేయకుండా ఆక్రమణల చెర నుంచి విడిపిస్తే అవి అందుబాటులోకి వస్తాయి.


ఇది శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని రాయవానిపాలేనికి సమీపంలో ఉన్న పిట్టవాని బంద. సర్వే నంబరు 129లో 4.66 ఎకరాల్లో విస్తరించి ఉంది. అడ్డతీగ గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఈ చెరువు ఇప్పుడు పూర్తిగా రూపు కోల్పోయింది. కొంతమంది చుట్టూ ఫెన్సింగ్‌ వేయడమే కాకుండా శాశ్వత కట్టడాలు నిర్మించారు. ఇప్పుడక్కడ చెరువు ఉన్నట్లు ఎవరైనా చెబితే కానీ తెలియని పరిస్థితి.

బీ బంద ఆక్రమణకు గురైనట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఆమె ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్‌ఐని ఆదేశించాం.         

- శ్రీనివాసరావు, తహసీల్దారు, ఎస్‌.కోట


గజపతినగరం మండలం కొనిశలో వెంకటరాజు చెరువు ఇది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా పదెకరాల వరకు ఆక్రమణకు గురైంది. కొంతమంది గర్భంలోనే గట్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు.

* మరోసారి సర్వే చేసి చెరువు విస్తీర్ణం ఎంతుందో గుర్తిస్తాం. ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంటాం.

- అరుణకుమారి, తహసీల్దారు, గజపతినగరం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని