logo

చిక్కొద్దు..చిత్తు కావొద్దు

డెంకాడ మండలానికి చెందిన బీటెక్‌ విద్యార్థి ఓ లోన్‌ యాప్‌లో రూ.15 వేల రుణం తీసుకున్నారు. అప్పు మొత్తం కట్టేసినా ఇంకా బకాయి ఉందని నిర్వాహకులు వేధింపులు ప్రారంభించారు. అతని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పంపించారు. భయంతో ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించగా.. విషయం తెలియడంతో మరుసటి రోజు నుంచి యాప్‌నిర్వాహకుల వేధింపులు ఆగిపోయాయి.

Published : 02 Oct 2022 02:33 IST

ఈనాడు - విజయనగరం

డెంకాడ మండలానికి చెందిన బీటెక్‌ విద్యార్థి ఓ లోన్‌ యాప్‌లో రూ.15 వేల రుణం తీసుకున్నారు. అప్పు మొత్తం కట్టేసినా ఇంకా బకాయి ఉందని నిర్వాహకులు వేధింపులు ప్రారంభించారు. అతని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పంపించారు. భయంతో ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించగా.. విషయం తెలియడంతో మరుసటి రోజు నుంచి యాప్‌నిర్వాహకుల వేధింపులు ఆగిపోయాయి.

ఓ యాప్‌ నుంచి రూ.2 వేలు తీసుకుని రూ.5 వేల వరకు చెల్లించానని.. అయినా వేధింపులు ఆపడం లేదని రెండు నెలల కిందట ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పందన’లో ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు.

కురుపాం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి చిరు ఉద్యోగం చేస్తున్నారు. అతను ఎలాంటి రుణం తీసుకోకపోయినా డబ్బులు చెల్లించాలని సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో అతని జోలికి రావడం మానేశారు.

రూ.5 వేల రుణం తీసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర పన్నులు మినహాయించుకుని రూ.3,500 ఇస్తారు. తర్వాత దీనికి రెట్టింపు వసూలు చేస్తున్నారు. అయినా బాకీ తీరక.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు.

చేతిలో చరవాణి ఉంటే చాలు రుణం ఇస్తాం.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు.. ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు ఖాతాలో డబ్బులు పడిపోతాయి. తక్కువ వడ్డీ కదా అని ఆశ పడితే ఇక అంతే సంగతి. ఆ ఊబిలో ఇరుక్కున్నామంటే బయటకు రావడం కష్టమే. లోన్‌యాప్‌ ఆగడాలు ఉమ్మడి జిల్లాకు విస్తరిస్తుండడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. మోసగాళ్ల చేతికి చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు.

పోలీసు శాఖ ప్రచారం

ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు శాఖ ముందుగా సచివాలయ మహిళా పోలీసులకు యాప్‌లపై అవగాహన కల్పించారు. వీరు నెల రోజుల పాటు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి యాప్‌లు ఎలా ఉంటాయి.. వాటికి ఎలా చిక్కుతారు.. ఎలా వేధిస్తారు.. ఏవి నిజమైనవో.. నకిలీవో ఎలా తెలుసుకోవాలి.. తదితర అంశాలను వివరిస్తారు. ఒకవేళ వాటికి చిక్కితే ఎలా బయటపడాలి.. ఎవరిని సంప్రదించాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. వీటికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలు ముద్రించి పంపిణీ చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో అతికించనున్నారు. ఇప్పటికే ఎవరైనా వాటి బారిన పడితే మానసికంగా కుంగిపోకుండా కౌన్సెలింగ్‌ ఇస్తారు. అవసరమైతే పోలీసు సాయం అందిస్తారు.

వేధింపులు ఇలా..

* ఎస్‌ఎంఎస్‌లు, లింకులు, వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రుణాలు ఇస్తారు.

* మన సమాచారం, ఫొటోలు, లొకేషను, కెమెరా వంటివి వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి.

* కాల పరిమితి నిర్దేశించి, రుణాలు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తారు. వడ్డీ చెప్పరు.

* వేధింపులు, దూషణలతో పాటు నకిలీ సమన్లు సృష్టించి పోలీసులు, కోర్టుల పేరుతో భయపెడుతుంటారు.

* ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పంపిస్తారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

* రుణానికి దరఖాస్తు చేసుకునే ముందు వెబ్‌సైట్‌ https://bi.in/script/bs.nbfclist.aspx సందర్శించి యాప్‌ నకిలీదా..నిజమైనదా తెలుసుకోవచ్ఛు

* రుణాలు మంజూరు చేసే సంస్థలు, యాప్‌ల చిరునామా, ఫోన్‌ నంబరు, ఇతర వివరాలు ముందుగా తెలుసుకోవాలి.

* నకిలీ సంస్థలు, మోసగాళ్లు పంపే లింకులను క్లిక్‌ చేయడం, గూగుల్‌ ఫారాలను నింపడం చేయొద్ధు

* ఓటీపీ, పిన్‌ నంబర్లు ఎవరికీ పంపించొద్ధు

* సైబర్‌ నేరానికి గురైతే 1930కు ఫోన్‌ చేయడం లేదా నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ https://cybercrime.gov.inకు ఫిర్యాదు చేయాలి.

* మన చరవాణి ఇతరులకు ఇవ్వకూడదు. వారు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, రుణం పొందిన వెంటనే వాటిని తొలగించే అవకాశం ఉంటుంది.

బాధితులు ముందుకు రావాలి

బాధితులు భయపడుతున్నారు. పోలీసులను సంప్రదించి వివరాలు ఇస్తే సంబంధిత యాప్‌ల వివరాలు ప్లే స్టోర్‌ నుంచి తొలగించాలని గూగుల్‌ సంస్థకు లేఖ రాస్తాం. వారు 48 గంటల్లో అవి కనిపించకుండా చేస్తారు. ఇవన్నీ కేసు నమోదు అయితే చేయగలం. - దీపికా ఎం.పాటిల్‌, ఎస్పీ, విజయనగరం.


రుణ యాప్‌ల ఇబ్బందులపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తెలిపారు. దీనిపై శనివారం నగరంలో దండుమారమ్మ కల్యాణ మండపంలో మహిళా పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించి గోడప్రతులు ఆవిష్కరించారు. డీఎస్పీలు టి.త్రినాథ్‌, మోహనరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని