logo

అటకెక్కిన ఆశయం

స్వచ్ఛ పట్టణాలే ధ్యేయంగా పురపాలికలు, నగర పంచాయతీల్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు మూడడుగులు ముందుకు..

Published : 26 Nov 2022 02:13 IST

పట్టణాల్లో నిలిచిన మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం

సాలూరు పురపాలికలో వేగావతి నదిలో కలుస్తున్న వ్యర్థజలాలు

బొబ్బిలి, విజయనగరం పట్టణం, నెల్లిమర్ల, పార్వతీపురం పురపాలిక, సాలూరు, న్యూస్‌టుడే: స్వచ్ఛ పట్టణాలే ధ్యేయంగా పురపాలికలు, నగర పంచాయతీల్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కు అన్న చందంగా మారాయి. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. మురుగు నీరును ఓ చోట చేర్చి.. శుద్ధి చేసేందుకు ప్లాంట్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రూ.కోట్లలో నిధులు కేటాయించారు. కొన్నిచోట్ల సగం ప్రక్రియ జరగ్గా.. మరికొన్ని ప్రాంతాల్లో స్థల సేకరణతో ఆపేశారు.

జిల్లా కేంద్రానికి మోక్షమెప్పుడో?

విజయనగరంలో పెద్దచెరువు వద్ద నాలుగేళ్ల కిందట అమృత్‌ ఫేజ్‌-2లో రూ.19.92 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్లాంటు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఏడు ఇన్‌లెట్‌ కాలువల ద్వారా మురుగు చెరువులోనికి చేరుతోంది. 2018లో స్వచ్ఛాంధ్ర ఆధ్వర్యంలో నిర్మించిన ప్లాంటు నిరుపయోగంగా ఉంది. 18 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన శుద్ధీకరణ విభాగం ఇప్పటికే నిరుపయోగంగా మారింది.

పనుల్లో జాప్యం..

పార్వతీపురంలో వరహాలగెడ్డ పక్కనే శుద్ధీకరణకు స్థల సేకరణ చేపట్టారు. పట్టణంలోని మరో రెండు చోట్ల ఏర్పాటుకు సర్వే నిర్వహించినా స్థల సమస్య నెలకొంది. దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. బంగారమ్మకాలనీ, జనశక్తి కాలనీలో కొంత భాగం, బెలగాం శివారు ప్రాంతం, సాయిరాం కాలనీ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య ఉంది.

కొలిక్కిరాని స్థల సమస్య..

బొబ్బిలి పురపాలక పరిధిలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు తొలుత మూడుచోట్ల స్థలాలను చూశారు. రాజానగర్‌ కాలనీ, మేదరబంద, నాయుడుకాలనీలో నిర్మాణానికి ఆలోచన చేశారు. రాజానగర్‌ కాలనీలో సుమారు ఎకరన్నర ప్రభుత్వం స్థలం అందుబాటులో ఉండడంతో తొలి విడతలో ఇక్కడ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లో సమస్య కొలిక్కి రాలేదు. ఈ పనులకు సుమారు రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందిరమ్మ, ఐటీఐ, నాయుడుకాలనీలు, కంచరవీధి, బాలాజీనగర్‌, దాడితల్లి, అంబేడ్కర్‌ కాలనీల్లో కాలువలు లేక మురుగంతా రోడ్లపైనే పారుతోంది.

నెలిమర్లలో నత్తనడకన...

నగర పంచాయతీలో 15వ ఆర్థిక సంఘ నిధుల్లో రూ.44 లక్షలు కేటాయించారు. స్థానికంగా ఇంకా స్థల అన్వేషణలోనే ఉంది. దీంతో మురుగు నీరు ముందుకు పారక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబునగర్‌ కాలనీ, జరజాపుపేటలోని బీసీకాలనీ, శివాలయం వీధి, తాడుతూరి వీధుల్లో కాలువలు లేవు.

సాలూరులో ఇలా..

పట్టణంలోని మురుగును వేగావతి నదిలోకి వదిలేస్తున్నారు. గుమడాం వద్ద ఎకరాన్నర స్థలం సేకరించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దాసరివీధి, కోటలో భాగం, సత్యసాయినగర్‌, సాయినగర్‌ కాలనీ, గుమడాం, బంగారమ్మకాలనీల్లో కాలువల వ్యవస్థ లేదు. కొత్తగా నిర్మించి ప్రధాన కాలువలకు అనుసంధానం చేయాలి.
అధికారుల మాట ఇదీ.. స్థల సమస్య ఇంకా కొలిక్కి రాలేదని, అది పరిష్కారమయ్యాక అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తామని బొబ్బిలి పుర కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రూ.38.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు నగరపాలక సంస్థ ఈఈ శ్రీనివాసరావు, ప్రజారోగ్యశాఖ ఈఈ దక్షిణామూర్తి చెప్పారు. నెల్లిమర్లలో కసరత్తు జరుగుతోందని కమిషనర్‌ బాలాజీప్రసాద్‌ వివరించగా.. పార్వతీపురంలో దశలవారీగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ రామప్పలనాయుడు వెల్లడించారు. సాలూరులో తొలుత గుమడాంలో ఏర్పాటు చేయనున్నామని కమిషనర్‌ శంకరరావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని