logo

రారండోయ్‌... మునగ నర్సరీలకు!

మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Published : 27 Nov 2022 02:21 IST

గుర్లలో నర్సరీని పరిశీలిస్తున్న వెలుగు అధికారులు

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డీఆర్‌డీఏ-వెలుగు ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో ప్రత్యేక ప్రాజెక్టుగా నర్సరీల ఏర్పాటుకు ఈ ఏడాది మే, జూన్‌లో సర్వే చేశారు. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 48.40 ఎకరాల్లో మునగ నర్సరీలు ఏర్పాటవుతాయని తొలుత భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. స్వయం సహాయక సంఘాల్లో 4,47,850 మంది సభ్యులకు ఐదు మొక్కల చొప్పున 22,39,250 అవసరం కాగా ప్రస్తుతం నర్సరీల్లో 5,52,500 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కేవలం 19 మండలాల్లో 54 మంది రైతులు 8.10 ఎకరాల్లో 36 నర్సరీలను మాత్రమే ఏర్పాటు చేయడంతో అధికారులు కంగుతిన్నారు. డెంకాడ, బొబ్బిలి, తెర్లాం, బాడంగి, భోగాపురం, రామభద్రపురం, విజయనగరం, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన 34 మంది రైతులు ముందుకు వచ్చి తర్వాత వెనకడుగు వేశారు. దీంతో జిల్లాలో మొక్కల పంపిణీని పూర్తిస్థాయిలో అధికారులు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు.

నిధుల కేటాయింపు..

నర్సరీలకు అవసరమైన నిధులు ఉపాధి హామీ (నరేగా) ద్వారా నేరుగా రైతు ఖాతాకే చెల్లిస్తారు. ఐదు నుంచి పది సెంట్ల నర్సరీ యూనిట్‌కు రూ.29,890, అదే ఎకరా యూనిట్‌కు రూ.5,56,000 ఇవ్వనున్నారు. మొక్కలు అందుబాటులోకి వచ్చాక అధికారుల సూచనల మేరకు ప్రతి మహిళకు ఉచితంగా అయిదేసి మొక్కలు ఇవ్వాలనేది నిబంధన. జిల్లాలో పెద్ద నర్సరీని చీపురుపల్లి మండలంలో ఎకరా పొలంలో ఏర్పాటు చేశారు.

దశల వారీగా అందరికి. : దశల వారీగా ఎక్కువ నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు మొక్కలు అందిస్తాం. మునగ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రైతులతో నర్సరీల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. అందుబాటులోకి వచ్చిన మొక్కలను తొలుత పంపిణీ చేస్తాం. మళ్లీ అదే నర్సరీలో రైతులకు ఆసక్తి ఉంటే మళ్లీ వారితోనే వీటిని పెంచేలా ప్రోత్సహిస్తాం.

-ఎ.కల్యాణ్‌ చక్రవర్తి, పథక సంచాలకుడు, డీఆర్‌డీఏ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని