logo

విజయనగరం 4 పార్వతీపురం మన్యం 25

మన ప్రగతి ఎంతో ప్రభుత్వం తేల్చింది. అందుకు ర్యాంకులు ప్రకటించింది. గత ఆరు నెలల పురోగతి ఆధారంగా వీటిని నిర్ణయించింది.

Updated : 29 Nov 2022 03:37 IST

గుంకలాం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం

*విజయనగరం జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించింది. గృహ నిర్మాణ శాఖ 3.67 పాయింట్లతో ముందుండగా.. స్పందన కార్యక్రమానికి 7.67, సచివాలయ సేవలకు 16.17 పాయింట్లు దక్కాయి.

*పార్వతీపురం మన్యం జిల్లా ర్యాంకుల విషయంలో కొంత నిరాశపరిచింది. కొత్తగా ఏర్పడిన జిల్లా, ఏజెన్సీ ప్రాంతం కావడం.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ జిల్లా రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకుతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. గృహ నిర్మాణ శాఖ, స్పందన లో పొరపాట్లు, సచివాలయ సేవల్లో వెనుకబడింది. స్పందన అర్జీల పునఃపరిశీలనలో మాత్రం 2.83 పాయింట్లతో ముందుంది. 

ఈనాడు, పార్వతీపురం మన్యం

మన ప్రగతి ఎంతో ప్రభుత్వం తేల్చింది. అందుకు ర్యాంకులు ప్రకటించింది. గత ఆరు నెలల పురోగతి ఆధారంగా వీటిని నిర్ణయించింది. సచివాలయ సేవలు, స్పందన, గృహ నిర్మాణం, భూ సమగ్ర సర్వేను కొలమానంగా తీసుకుంది.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రతి నెలా కలెక్టర్లతో నిర్వహించే దూరదృశ్య సమావేశంలో సేవలపై సమీక్షిస్తుంటారు. జూన్‌ నుంచి నవంబరు చివరి వారం వరకు సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు. విభాగాల వారీగా తక్కువ పాయింట్లు సాధించిన జిల్లా మెరుగ్గా ఉన్నట్లు.. ఎక్కువగా వస్తే వెనుకబడినట్లు అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి సగటు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు.

సచివాలయ సేవలు అంతంతే

సచివాలయ సేవలకు విజయనగరానికి 16.17 పాయింట్లు దక్కాయి. జిల్లాలో 543 గ్రామ, 96 వార్డు సచివాలయాలు ఉన్నాయి. కలెక్టర్‌ సూర్యకుమారి తరచూ ఎక్కడో ఓ చోట సచివాలయాలను తనిఖీ చేస్తూనే ఉన్నారు. దస్త్రాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. చాలాచోట్ల లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. దస్త్రాల నిర్వహణపై ఇప్పటికీ కొంతమందికి అవగాహన లేకపోవడం గమనార్హం. సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి. దీని ప్రభావం సేవలపై పడుతోంది. బీ పార్వతీపురం మన్యం జిల్లా 20.50 పాయింట్లతో వెనుకబడింది. ఈ జిల్లాలో 299 గ్రామ, 38 వార్డు సచివాలయాలున్నాయి. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఈ సేవలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీవాసులకు  ఎలాంటి సేవలు అందుతాయో చాలామందికి ఇప్పటికీ తెలియదు. మారుమూల గ్రామాలు కావడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్పందన ఎంత?

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందకపోతే వాటిని మరోసారి పునఃపరిశీలిస్తారు. విజయనగరం జిల్లా ఈ విషయంలో 7.67 పాయింట్లతో ఫర్వాలేదనిపించుకుంది. సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా అర్జీదారులతో మాట్లాడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశిస్తున్నారు. జూన్‌, జులై, ఆగస్టు, అక్టోబరులో పదిలోపు పాయింట్లు ఉండగా.. సెప్టెంబరులో 16, నవంబరులో 14 పాయింట్లతో కొంత         నిరాశపరిచింది.
* పార్వతీపురం మన్యం జిల్లాలో స్పందన నిర్వహణ 2.83 పాయింట్లతో రాష్ట్రస్థాయిలో మెరుగ్గా ఉంది. పునఃపరిశీలన దరఖాస్తులు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా స్పందన ప్లస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దీన్ని పరిష్కరిస్తున్నారు. మన్యం జిల్లా జూన్‌ నుంచి నవంబరు వరకు పదిలోపు పాయింట్లతో ముందుంది. ఆగస్టు, అక్టోబరు, నవంబరు నెలల్లో కేవలం ఒకే పాయింటుతో మిగతా జిల్లాల కంటే ముందు వరుసలో నిలిచింది.
* ప్రతి వారం వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపిస్తుంటారు. కొన్ని తప్పుగా పంపించగా.. ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో పొరపాట్ల కారణంగా కొన్ని సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. తప్పుగా ఎండార్స్‌ చేయడంలో విజయనగరం 13.50 పాయింట్లు, మన్యం జిల్లా 23.25 పాయింట్లతో ఉన్నట్లు నివేదికలో తేలింది.

భూ సమగ్ర సర్వే

భూ దస్త్రాల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం కొన్ని నెలలుగా భూ సమగ్ర సర్వే చేస్తోంది. ఇందులో విజయనగరం 40 పాయింట్లు సాధించగా.. పార్వతీపురం 71 పాయింట్లు దక్కించుకుంది. విజయనగరంలో 983 గ్రామాలకు 754 చోట్ల డ్రోన్లు ఎగరేశారు. ప్రకటన-13 ఇచ్చిన గ్రామాలు 185 ఉన్నాయి. మన్యం జిల్లాలో 965 గ్రామాలకు 495 చోట్ల డ్రోన్‌ సర్వే పూర్తి చేశారు. ప్రకటన-13 ఇచ్చినవి 102 వరకు ఉన్నాయి.

సొంతింటి యోగం

* నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విజయనగరం జిల్లా ఇళ్ల నిర్మాణాల్లో 22 పాయింట్లతో మెరుగైన స్థితిలో ఉంది. ఈ నెల 20 వరకు 78158 ఇళ్లు మంజూరు చేయగా.. 69,299 మంది పనులు ప్రారంభించారు. ఇందులో 13,743 ఇళ్లు పూర్తయ్యాయి.
* మన్యం జిల్లా మాత్రం 120 పాయింట్లతో వెనుకబడింది. ఇక్కడ 24,740 ఇళ్లు మంజూరు చేయగా.. 21,092 పనులు ప్రారంభమయ్యాయి. 6,582 నిర్మాణం పూర్తి కాగా.. 14,510 వివిధ దశల్లో ఉన్నాయి.

డ్రోన్‌ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు