logo

కాలువలకు మహర్ధశ

ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు.

Updated : 29 Nov 2022 03:39 IST

 2023-24 ఉపాధి ప్రణాళికలో అభివృద్ధి

తాటిపూడి కాలువ

విజయనగరం అర్బన్‌, గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు. 2023-24 ఏడాదిలో నీటి పారుదల కాలువల్ని బాగు చేయాలని నిర్ణయించారు. తుప్పల తొలగింపుతో పాటు పూడికతీత పనులు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆయా పనులను గుర్తించిన అధికారులు అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ ఆమోదంతో మండల, జిల్లా పరిషత్తులో తీర్మానం ఆధారంగా జనవరి నుంచి పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి జిల్లాల్లో దీర్ఘకాలంగా మేజర్‌, మైనర్‌ రిజర్వాయర్ల కాలువలు అభివృద్ధికి నోచుకోలేదు. వీటిలో పూడిక పేరుకుపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంటోంది. దీంతో వాటి అభివృద్ధికి జిల్లాస్థాయిలో నిర్ణయించడంతో జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం  చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 23 మండలాల్లో 269 కాలువలు బాగు చేయాలని నిర్ణయించారు.

వీటికి మంచిరోజులు

విజయనగరం జిల్లా: తాటిపూడి, తోటపల్లి, వెంగళరాయ, ఆండ్ర,  పెదగెడ్డ, పెదంకలాం, పారాది, గజపతినగరం ఆనకట్ట.
మన్యం జిల్లా: వట్టిగెడ్డ, జంఝావతి, గుమ్మడి గెడ్డ, కొండలేవిడి, గుజ్జువాయి, లిక్కిడి, ఊసకొండ, వలస బల్లేరు, కైరాడ, జి.శివడ, తోటపల్లి, వరహాల గెడ్డ.


గ్రామసభల్లో..: వచ్చే ఏడాదిలో చేపట్టనున్న పనుల గుర్తింపునకు సంబంధించి ఇప్పటికే గ్రామసభలు పూర్తిచేశారు. రెండు జిల్లాల్లో 1226 గ్రామసభలు నిర్వహించి, 24,928 పనులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 3468, పార్వతీపురం మన్యంలో 21,460 పనుల్ని ఎంపిక చేశారు. 140 రకాల పనులకు ప్రాధాన్యమిచ్చారు. నీటిపారుదల కాలువలతో పాటు ఫీడర్‌ ఛానళ్లు, ఫీల్డ్‌ ఛానళ్లు, ఎంఐ ట్యాంకులు, ట్రెంచ్‌ కటింగ్‌, ఫారం పాండ్స్‌ (నీటి కుంటలు), చేపల చెరువులు, చెత్త సంపద కేంద్రాలు, పెర్క్యులేషన్‌ ట్యాంకులు, ఉద్యానాలు, సూక్ష్మనీటి సేద్యం తదితర పనులు చేపట్టనున్నట్లు రెండు జిల్లాల పీడీలు ఉమా పరమేశ్వరి, రామచంద్రరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని