logo

రోడ్డు ప్రమాదంలో క్యాటరింగ్‌ యజమాని దుర్మరణం

వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. ద్విచక్ర వాహనం రక్షణ గోడను ఢీకొనడంతో  క్యాటరింగ్‌ యజమాని మృత్యువాత పడ్డాడు.

Published : 29 Nov 2022 03:13 IST

నరసింహులు (పాతచిత్రం)

ఆనందపురం(విశాఖపట్నం), న్యూస్‌టుడే: వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. ద్విచక్ర వాహనం రక్షణ గోడను ఢీకొనడంతో  క్యాటరింగ్‌ యజమాని మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల మండలం పెదబంటుబిల్లి గ్రామానికి చెందిన కలగర్ల నరసింహులు(55) వలస కూలీగా 24 ఏళ్ల కిందట విశాఖలోని పూర్ణమార్కెట్‌కు వచ్చారు. అప్పటి నుంచి రోజువారి కూలీగా చేస్తూ కొన్నేళ్ల కిందట స్వయంగా మణికంఠ క్యాటరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించి శుభకార్యాలకు ఆహారం అందించడం, వంటలు చేయడం మొదలుపెట్టారు. స్వగ్రామం పెదబంటుబిల్లిలో బంధువులు అయ్యప్పస్వామి పూజ నిర్వహించగా అక్కడ వంటలు చేయడానికి శనివారం రాత్రి వెళ్లారు. పనులు ముగించుకొని సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై సహాయకునితో కలిసి తిరిగి బయలుదేరారు. ఆనందపురంలోని పెద్దిపాలెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి పైవంతెన రక్షణ గోడను వీరి వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసింహులు అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు పేర్కొన్నారు. శవ పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. నరసింహులుకు భార్య రత్నకుమారి, ముగ్గురు పిల్లలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని