logo

రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. ఇంత నిర్లక్ష్యమా?

రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించకపోతే ఎలా? విద్యార్థులు వాటిపై రాయకుండా అలా ఉంచడమేమిటి?

Published : 20 Jan 2023 02:43 IST

బొబ్బిలి గురుకుల పాఠశాల సిబ్బందిపై పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆగ్రహం

గురుకులాల కార్యదర్శి నరసింహారావు, ప్రిన్సిపల్‌ రఘునాథరావు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

బొబ్బిలి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించకపోతే ఎలా? విద్యార్థులు వాటిపై రాయకుండా అలా ఉంచడమేమిటి? ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యమా? మిమ్మల్ని క్షమించడానికి లేదంటూ గురుకులాల కార్యదర్శి నరసింహారావు, ప్రిన్సిపల్‌ రఘునాథరావు, బోధనా సిబ్బందిపై పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ మండిపడ్డారు. జిల్లాలోని పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా బొబ్బిలి బాలుర గురుకుల పాఠశాలను గురువారం రాత్రి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాలను పరిశీలించారు. పేజీలు ఖాళీగా ఉండడంతో ఎందుకు విద్యార్థులతో రాయించలేదు, విద్యాసంవత్సరం ముగిసినా ఇవి గుర్తుకురాలేదా? అంటూ సంబంధిత బోధన సిబ్బందిని ప్రశ్నించారు. ఇలాగైతే పిల్లలు ఎలా నేర్చుకుంటారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.  అక్కడి నుంచి కేజీబీవీ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులతో ఆయనే నేరుగా మాట్లాడారు. అనంతరం రైల్వే అతిథిగృహంలో రాత్రి 10.30 గంటల తర్వాత విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలను తనిఖీ చేస్తే సరిపోదని, ఏం చేస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆయన వెంట ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఉపవిద్యాశాఖాధికారి తిరుపతినాయుడు ఉన్నారు.  

నేడూ పర్యటన..

జిల్లాలోని పలు పాఠశాలలు, వసతిగృహాలను ఆయన శుక్రవారం సందర్శించనున్నట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ వర్గాలు కంగారుపడుతున్నాయి. గురువారం రాత్రి గురుకుల పాఠశాలలో బస చేస్తారని భావించి ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన రైల్వే అతిథిగృహానికి చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన నిరుద్యోగులు ఆయనను కలిసి అవకాశం కల్పించాలని వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు పంపించి సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించి అసహనం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు మీరెందుకు భయపడుతున్నారు? అంటూ కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ మీపై చర్య తీసుకునే అధికారం ఎవరికి ఉంది? అని అనగానే మీకే ఉందని కార్యదర్శి అన్నారు. తెలుసు కదా.. ఈ లోపాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సరిచేసుకోకపోతే అంతా ఇంటికి వెళ్లిపోతారని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని