logo

ఉండేది ఎక్కడో..హాజరు ఇక్కడే

ఉద్యోగుల్లో పారదర్శకత పెంచడానికి.. సమయపాలన పాటించడానికి ప్రభుత్వం ముఖహాజరు విధానాన్ని తీసుకొచ్చింది.

Updated : 05 Feb 2023 05:54 IST

హాజరు తీరును పర్యవేక్షిస్తున్న డీఎంహెచ్‌వో రమణకుమారి

ఈనాడు-విజయనగరం: ఉద్యోగుల్లో పారదర్శకత పెంచడానికి.. సమయపాలన పాటించడానికి ప్రభుత్వం ముఖహాజరు విధానాన్ని తీసుకొచ్చింది. విధుల పట్ల అలసత్వం వహించే కొంతమందికి ఇది ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏకంగా ఉన్నతాధికారులనే పక్కదారి పట్టించి విధుల్లో లేకపోయినా హాజరు వేసేస్తున్నారు.

ప్రభుత్వం గతంలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సిందే. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బంది మైనం, రబ్బరు వంటి పదార్థాలతో దొంగ వేలిముద్రలు తయారు చేయించారు. వీటిని కింది స్థాయి సిబ్బందికి ఇచ్చి సమయానికి హాజరు వేయించేవారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓ వైద్యాధికారి తన వ్యక్తిగత పనిపై విజయవాడకు వెళ్లారు. ఐదు రోజులు ఆసుపత్రికి రాకపోయినా హాజరు పడిపోయింది. ఇదంతా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతా యాప్‌లోనే..

ప్రభుత్వం కొత్తగా ముఖహాజరు విధానాన్ని తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం గతేడాది జూన్‌ నుంచే అమలు చేస్తున్నారు.  ప్రస్తుతం పీహెచ్‌సీల పరిధిలో రోజుకు 96 శాతం, వైద్య కళాశాలలో 65 శాతం, డీసీహెచ్‌ఎస్‌ పరిధిలో 75 శాతం అమలవుతోంది. పనిచేసే చోటు నుంచే హాజరు వేయాలి. ఒకవేళ క్షేత్రస్థాయికి వెళ్తే.. అక్కడి నుంచే ఏ కారణంతో వెళ్లారు.. ఎక్కడికి వెళ్లారో యాప్‌లో నమోదు చేయాలి. సెలవు పెట్టినా అందులోనే సమాచారం ఇవ్వాలి. దీనికి అంతర్జాలంతో సంబంధం లేదు.      

వారి సహకారంతోనే..

క్షేత్రస్థాయిలో ఉండి ముఖ హాజరు వేస్తే తప్పనిసరిగా డ్రాయింగ్‌ అధికారి ఆమోదం తెలపాలి. కొత్తవలస మండల వ్యవహారంలో హాజరు వేస్తున్నా.. ఆమోదం తెలపకపోవడంతో అనుమానం వచ్చి డీఎంహెచ్‌వో రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టారు. కొన్నిచోట్ల డ్రాయింగ్‌ అధికారులతో వైద్యులు, సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఎక్కడి నుంచో హాజరు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఓ డ్రాయింగ్‌ అధికారిని ఆ విధుల నుంచి తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. మరోచోట డబ్బుల విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ బయటకు రావడంతో ఆ శాఖ అప్రమత్తమైంది.* పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్రాసుపత్రి, మూడు ప్రాంతీయ, మూడు సీహెచ్‌సీలు, 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. డీఎంహెచ్‌వో పరిధిలో 1137 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 92 శాతం మంది ముఖహాజరు వేస్తున్నారు. డీసీహెచ్‌ఎస్‌ పరిధిలో 530 మందికి 90 శాతానికి పైగా హాజరు శాతం నమోదవుతోంది. 

* కొత్తవలస మండలంలోని ఓ ఆసుపత్రిలో వైద్యాధికారిణి తన నివాసం నుంచి హాజరు వేస్తున్నట్లు డీఎంహెచ్‌వో రమణకుమారి తనిఖీల్లో గుర్తించారు. ఆసుపత్రిలో ఆమె ఉండగానే.. వైద్యాధికారిణి రాకుండానే హాజరు వేసినట్లు యాప్‌లో నమోదు కావడంతో  అవాక్కయ్యారు.
*ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొన్ని పీహెచ్‌సీల్లో కొందరు వైద్యులు సమయానికి ఆసుపత్రికి రావడం లేదు. అయినా ముఖ హాజరు నమోదవుతోంది. పైగా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి అసలు రాకపోయినా హాజరు పడిపోతుంది.
*బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉన్న సమయంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ సీహెచ్‌సీలో యూట్యూబ్‌లో చూసి వేలిముద్రలు తయారు చేసుకున్నారు. వీటిని అక్కడి సిబ్బందికి ఇచ్చి రోజూ వారిగా బయోమెట్రిక్‌ వేయించే వారు. ఇప్పుడు ముఖహాజరు రావడంతో సాంకేతిక లోపాలను అనుకూలంగా చేసుకుని ఆసుపత్రికి రాకుండానే హాజరు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి రమణకుమారి గురువారం తన కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా హాజరు తీరును పరిశీలించారు. ఓ ఏఎన్‌ఎం మధ్యాహ్నం 2.30 గంటలకు తన పీహెచ్‌సీ పరిధిలో లేకుండా ముఖహాజరు వేసినట్లు లొకేషన్‌ ఆధారంగా గుర్తించారు. వెంటనే ఆమెతో మాట్లాడగా ఇంటికి వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో మొదటి హెచ్చరికగా మందలించి వదిలేశారు.


నిఘా పెట్టాం

ముఖహాజరు విషయంలో కొందరు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీనిపై నిఘా పెట్టాం. ఈ విధానాన్ని పర్యవేక్షించడానికి వైద్యుడు వెంకటేష్‌ను నియమించాం. అందరినీ అప్రమత్తం చేశాం. ఎవరైనా ఈ విషయంలో తప్పుగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి.

 ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని