logo

ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే

పేదల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని.. ప్రధానంగా విద్య, వైద్యం వంటి వాటిని వెంటనే కల్పించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనరు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.  

Published : 05 Feb 2023 04:12 IST

అశోక్‌గజపతిరాజు

కేన్సర్‌ ఆసుపత్రి సాధన సమితి దీక్షకు మద్దతు

దీక్షలో బాబ్జీకి సంఘీభావం తెలుపుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేశ్వరరావు తదితరులు

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: పేదల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని.. ప్రధానంగా విద్య, వైద్యం వంటి వాటిని వెంటనే కల్పించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనరు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.  జిల్లాలో కేన్సర్‌ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం కేన్సర్‌ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ ఐకాస ఛైర్మన్‌ భీశెట్టి బాబ్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. జిల్లాలో ఎక్కువగా కేన్సర్‌తో మరణిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశోక్‌ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున కేంద్రం ఇస్తామని చెప్పిందని, మూడేళ్లు మాత్రమే ఇచ్చినట్లు తనకు గుర్తుందన్నారు. అక్కడి నుంచి ఆ నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారని, కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన వ్యక్తులు.. ఎవరి మెడలు వంచారని..? ఆయన ప్రశ్నించారు. విశాఖ, విజయనగరాన్ని యాస్పిరేషన్‌ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని, ఈ విషయాన్ని మెడలు వంచేవారు మరిచిపోయారన్నారు.  ప్రభుత్వానికి జ్ఞానం ఇప్పించు తల్లీ! అని పైడిమాంబను కోరారు. కొణతాల మాట్లాడుతూ  సరైన వైద్య సౌకర్యం లేక కేన్సర్‌  బాధితులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేశ్వరరావు, వైకాపా నాయకులు పిల్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌, భాజపా నాయకులు కుసుమంచి సుబ్బారావు కాంగ్రెస్‌ ఉత్తరాంధ్ర జోనల్‌ సమన్వయకర్త హేమంత్‌, జనసేన నాయకులు గురాన అయ్యలు, యలమంచిలికి చెందిన పరిపూర్ణ సర్వేంద్ర స్వామి, ఐకాస కన్వీనర్‌ మమ్ముల తిరుపతిరావు, కోకన్వీనర్‌ గోపాలరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని